న్యూఢిల్లీ: ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సరదాగా కాసేపు ముచ్చటించుకున్నారు. యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్లమెంటు ఆవరణలో శనివారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది. పార్లమెంటు ఆవరణలో ఉన్న ప్రేరణా స్థల్ లో పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ తో పాటు పలువురు ఎంపీలు ముందుగా పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు.
తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన కాన్వాయ్ లో అక్కడికి వచ్చారు. కారు దిగి ఎంపీలతో పాటు రాహుల్ ను కూడా ఆయన పలకరించారు. రాహుల్ కూడా మోదీని పలకరించారు. ఆ సమయంలో అక్కడున్న ఎంపీలు వారిద్దరి సంభాషణను ఆసక్తిగా గమనించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా మోదీ, రాహుల్ మాట్లాడుకున్న వీడియో వైరల్ అయింది. ‘‘ప్రతిపక్ష నేత రాహుల్ ను మోదీ పలకరించడం ఆనందంగా ఉంది” అని పలువురు యూజర్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. కాగా.. తర్వాత పూలే విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. మోదీతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు ఎంపీలు కూడా నివాళులర్పించారు. వారిలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరులు ఉన్నారు.
