
జైపూర్: రాజస్థాన్‌లోని కాంగ్రెస్ పార్టీ ఓ క్రికెట్ జట్టు లాంటిదని.. అందులోని బ్యాటర్లు ఐదేండ్ల పాటు ఒకరినొకరు రనౌట్ చేయడానికే ప్రయత్నించారని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వేళ.. క్రికెట్‌తో ముడిపెడుతూ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చురూ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి.. ఈ రెండు ఒకదానికొకటి శత్రువులని, బీజేపీతోనే రాజస్థాన్ వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ‘క్రికెట్‌లో బ్యాటర్ అతడి జట్టు కోసం పరుగులు చేస్తాడు.
కానీ, కాంగ్రెస్‌లో తీవ్ర అంతర్గత పోరు ఉంది. ఈ పార్టీ నాయకులు పరుగులు తీయడానికి బదులుగా.. ఒకరినొకరు రనౌట్ చేయడానికే ఐదేండ్లు ప్రయత్నించారు’ అని సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య వివాదాన్ని గుర్తు చేస్తూ ప్రధాని మోదీ కామెంట్ చేశారు. మంచి ఉద్దేశాలకు, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న సంబంధం వెలుగు, చీకటి మధ్య ఉన్న సంబంధం లాంటిదేనని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అవినీతిపరులందరినీ కట్టడి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. రాజస్థాన్ సంస్కృతిని కాపాడేందుకు కాంగ్రెస్‌ను గద్దె దించడం ముఖ్యమని చెప్పారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఘోర ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి
ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీలో వీఐపీ సెక్యూరిటీ డ్యూటీకి వెళ్తున్న పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. చురు జిల్లాలోని బఘ్సరలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రక్కును ఢీకొంది. పొగమంచు కారణంగా జరిగిన ఈ యాక్సిడెంట్లో అయిదుగురు పోలీసులు స్పాట్లోనే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.