పిల్లల్ని మరొకరితో పోల్చొద్దు.. పరీక్షా పే చర్చలో మోదీ

పిల్లల్ని మరొకరితో పోల్చొద్దు..   పరీక్షా పే చర్చలో మోదీ

రోజుకు 10 నుంచి 12 గంటలు చదవాలని తల్లిదండ్రులు విద్యార్థుల పైన ఒత్తిడి చేయడం మంచిది కాదని ప్రధాని మోదీ అన్నారు.  పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొ్న్న ఆయన..   ఢిల్లీలోని భారత మండపంలో  విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.  ఈ సందనర్భంగా పరీక్షలు రాసే చిన్నారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.  పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని.. తల్లిదండ్రులు కూడా వారిపై  ఒత్తిడి పెంచకూడదన్నారు.  పిల్లలను తల్లిదండ్రులు మరొకరితో పోల్చకూడదని అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుందని మోదీ తెలిపారు. విద్యార్థులు త‌మ‌తో తాము పోటీప‌డాల‌ని చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తున్నారని, అది మంచిది కాదన్నారు.  

ఉపాధ్యాయులు కూడా తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకుండా..  విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే విధంగా మార్చుకోవాలన్నారు ప్రధాని మోదీ.   ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. విద్యార్థులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారన్న మోదీ... ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉందన్నారు.  అందువల్ల ఈ కార్యక్రమం తనకి కూడా పరీక్ష లాంటిదేనని చెప్పుకొచ్చారు.   ఈసారి ప‌రీక్షా పే చ‌ర్చా కార్యక్రమానికి ప్రతి రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థుల‌ను, ఓ టీచ‌ర్‌ను ఆహ్వానించారు. క‌లా ఉత్సవ్ విజేత‌ల‌ను కూడా ఆహ్వానించారు. MyGov పోర్టల్ ద్వారా సుమారు 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.