
జైపూర్: నిజాలు మాట్లాడేవాళ్లను పార్టీ నుంచి గెంటేయడమే కాంగ్రెస్ కల్చర్ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. దేశంలోని అల్లరిమూకలు, నేరగాళ్ల విషయంలోనే కాకుండా టెర్రరిస్టుల పట్ల కూడా మెతకగా వ్యవహరించుడే ఆ పార్టీ విధానమని విమర్శించారు. కాంగ్రెస్ విధానమే కఠోర అవినీతి అని ఆరోపించారు. ఆ వైఖరే రాజస్థాన్‌ను నేరాల్లో దేశంలోనే అగ్రస్థాయికి చేర్చిందన్నారు. బుధవారం భిల్వారా, దుంగాపూర్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు మంచి కోసం పార్టీని ఎదిరించిన సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్‌ను కాంగ్రెస్ తొలగించిందని, ఇప్పుడు సచిన్ పైలట్‌పైనా అదే రీతిలో వ్యవహరిస్తోందని కామెంట్ చేశారు.
కాంగ్రెస్‌ను పర్మినెంట్‌గా తొలగించాలె
రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండే అర్హత అశోక్ గెహ్లాట్‌కు లేదని మోదీ విమర్శించారు. రాజస్థాన్‌లో మతోన్మాద శక్తులకు కాంగ్రెస్ స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. రేపిస్టులకు మంత్రులే అసెంబ్లీలో క్లీన్ చిట్ ఇస్తుంటే మన తల్లులు, బిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఎలా సేఫ్ గా ఉంటారని ప్రశ్నించారు. ఐదేండ్లలో రాజస్థాన్‌ను దోచుకోవడంలో కాంగ్రెస్ ఏ రాయినీ వదల్లేదన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలోనూ కాంగ్రెస్ స్కామ్ చేసిందని ఆరోపించారు. సన్నిహితుల పిల్లలకు ఉద్యోగాలను అమ్ముకుని నిరుద్యోగులకు అన్యాయం చేసిందని చెప్పారు. రాష్ట్రాన్ని అణచివేత, అవినీతి నుంచి విముక్తి చేయాలంటే గెహ్లాట్ సర్కారును తుడిచిపెట్టేయాలని ప్రజలను మోదీ కోరారు. ఓటింగ్ టైంలో కమలం బటన్ నొక్కి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పర్మినెంట్‌గా తొలగించాలని పిలుపునిచ్చారు. పేదలు, ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్ తప్పుడు విధానాలు ఏనాడు అంతమవుతాయో.. ఆ రోజు నుంచే మోదీ హామీలు అమలవుతాయని చెప్పారు. కేంద్ర పథకాలు త్వరగా అమలు కావాలంటే కాంగ్రెస్ నిష్క్రమణ ఒక్కటే మార్గమని చెప్పారు.
జీ20 సమిట్‌లో డీప్ ఫేక్ ప్రస్తావన
జీ20 సమిట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం వర్చువల్ భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమిట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డీప్ ఫేక్ సమస్యను ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) తో ఎదురయ్యే నెగెటివ్ ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోందన్నారు. సమాజానికి డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రమాదకరమనే విషయాన్ని గుర్తించాలని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై జీ20 సభ్య దేశాలు కలిసి పనిచేయాలని భారత్ ఆశిస్తోందని మోదీ చెప్పారు.