ఆర్టికల్ 370పై ప్రజలను.. కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది: మోదీ

ఆర్టికల్ 370పై ప్రజలను.. కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది: మోదీ

శ్రీనగర్: అభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్ కొత్త శిఖరాలను తాకుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నదని తెలిపారు. ఆర్టికల్ 370పై జమ్మూ కాశ్మీర్ ప్రజలతో పాటు మొత్తం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. ‘ఆర్టికల్‌ 370’ రద్దు తర్వాత తొలిసారిగా గురువారం  కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత పబ్లిక్ ర్యాలీలో పాల్గొని బక్షి స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఇక్కడి ప్రజలను మిస్ లీడ్ చేస్తున్నవి. తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నవి. కానీ.. ఇప్పుడు అందరికీ సమాన హక్కులు, అవకాశాలు దక్కాయి. తమను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని ఇక్కడి ప్రజలకు తెలుసు” అని మోదీ విమర్శించారు. ఇలాంటి జమ్మూ కాశ్మీర్​ను చూసేందుకే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన జీవితం త్యాగం చేశారని అన్నారు.

అగ్రి – ఎకానమీకి బూస్ట్

వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా ముందుకు వెళ్తామని, జమ్మూ కాశ్మీర్ అగ్రి – ఎకానమీకి బూస్ట్ ఇస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘శ్రీనగర్ వాసులు ఎంతో మంచివాళ్లు. జమ్మూ కాశ్మీర్ డెవలప్​మెంట్ ప్రాజెక్టులు అన్నీ జాతికి అంకితం చేస్తున్నాం. జమ్మూ అభివృద్ధే.. దేశ అభివృద్ధి. అందుకే అన్ని రంగాల్లో అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’’అని అన్నారు. 

జమ్మూ కాశ్మీర్.. దేశ గౌరవానికి చిహ్నం

జమ్మూ కాశ్మీర్  దేశానికే తలమానికమని మోదీ చెప్పారు. దేశ అభివృద్ధికి, గౌరవానికి చిహ్నమన్నారు. అందుకే దేశాభివృద్ధిలో జమ్మూ కాశ్మీర్​కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పవర్ ఆఫ్ డెవలప్​మెంట్, టూరిజం అవకాశాలు, రైతుల సాధికారత, యూత్ లీడర్​షిప్ అనేవి.. జమ్మూ కాశ్మీర్​కు పునాది అని చెప్పారు. ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులు తమ కుటుంబంలోని ఐదుగురు సభ్యులను దేశ పర్యటనకు పంపించాలి” అని కోరారు. తాను కూడా ఇక్కడి ప్రజల మనసు గెలుచుకునేందుకు వచ్చానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్​కు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు. 

శివరాత్రి, రంజాన్ శుభాకాంక్షలు

ప్రధాని మోదీ స్థానికులకు ముందస్తుగా మహా శివరాత్రి, రంజాన్‌ మాసం విషెస్ చెప్పారు. మోదీ పర్యటనకు కాశ్మీర్ లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టూరిజం సెక్టార్​లో భాగంగా రూ.1,400 కోట్లతో ‘స్వదేశ్ దర్శన్’, ‘ప్రసాద్’ స్కీమ్స్​ ప్రాజెక్టులను కూడా మోదీ లాంచ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వెయ్యి మందికి అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశారు. 

ఇతను నజీమ్.. నా ఫ్రెండ్: మోదీ

వికసిత్ భారత్​లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నవారితో ప్రధాని మోదీ కొంతసేపు ముచ్చటించారు. ఒక సెల్ఫీ కావాలని నజీమ్.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆయన అంగీకరించారు. సెల్ఫీ ఫొటోను మోదీ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘ఇతను నజీమ్.. నా ఫ్రెండ్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘‘నా ఫ్రెండ్ నజీమ్‌తో తీసుకున్న సెల్ఫీ ఎప్పటికీ మరిచిపోలేను. అతను చేస్తున్న మంచి పనికి నేను ఫిదా అయ్యాను. శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో నజీమ్  నన్ను సెల్ఫీ అడిగాడు. అతన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మరింత అభివృద్ధి చెందాలని విషెస్ చెప్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. నజీమ్.. తేనెటీగలు పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. తేనెటీగల పెట్టెలు కొనేందుకు ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ కూడా పొందాడు.