కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ

కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ

కాళేశ్వరంలో అవినీతిలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని విమర్శించారు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని ..2024, మార్చి 5వ తేదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పటేల్ గూడాలోని ఎస్ఆర్ ఇన్ ఫినిటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీశంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్ చెరులో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసినా కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య అవినీతి బంధం ఉందని.. రెండు పార్టీల బంధం గురించి ప్రపంచమంతా తెలుసన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకే నాణానికి రెండు ముఖాలు అని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి చూసి విసుగు చెంది కాంగ్రెస్ కు అధికారమిచ్చారన్నారు. కాంగ్రెస్ అయినా.. బీఆర్ఎస్ అయినా రెండూ ఒకటే.

మోదీ గ్యారంటీ అంటే పూర్తిగా అమలైనట్లేనన్నారు మోదీ. మా పథకాల్లో ఎక్కువ లబ్ఢి పొందింది మహిళలేనని చెప్పారాయన. తెలంగాణ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని..  ఇప్పటికే రూ.వేల కోట్ల ప్రాజెక్టులు కేటాయించామన్నారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా రైతులకు పీఎం సమ్మాన్ నిధి అందుతోందని చెప్పారు. కుటుంబ పాలనలో రాష్ట్రాలు ఆగమయ్యాయని మండిపడ్డారు. మోదీకి కుటుంబం లేదంటూ ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయని.. 140 కోట్ల దేశ ప్రజలే తన కుటుంబమన్నారు.  కుటుంబ పార్టీలదీ ఫ్యామిలీ ఫస్ట్ నినాదం.. నేషన్ ఫస్ట్ మోదీ నినాదం అని కౌంటర్ ఇచ్చారు ప్రధాని.