తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి గేట్ వే: ప్రధాని మోదీ

తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి గేట్ వే: ప్రధాని మోదీ

 తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని,  తెలంగాణ.. దక్షిణ భారతదేశానికి గేట్ వే అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.  రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని ..2024, మార్చి 5వ తేదీ మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పటేల్ గూడాలోని ఎస్ఆర్ ఇన్ ఫినిటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రెండో రోజు తెలంగాణ  ప్రజలతో ఉండడం సంతోషంగా ఉందన్నారు.  దేశవ్యాప్తంగా రూ.56వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. సంగారెడ్డిలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు.

దేశంలో తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేటలో ప్రారంభించామని... ఏవియేషన్ రంగంలో తెలంగాణకు గుర్తింపు లభింస్తుందన్నారు మోదీ. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని తెలిపారాయన. వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఘట్ కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించామని... ఈ ఎంఎంటీఎస్ తో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందన్నారు. బడ్జెట్ లో మౌళిక సదుపాయాల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. 

అంతకుముందు, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని మోదీ సందర్శించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మోదీకి ఆశీర్వచనం చేసిన పూజారులు... అమ్మవారి వస్త్రంతో తో పాటు మహంకాళి ఫొటో ఫ్రేమ్ ను బహుకరించారు.