- దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతం: కిషన్ రెడ్డి
- 10న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ దేశ వస్త్ర పరిశ్రమ రంగానికి మరింత ఊతమివ్వనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మన్నికగా నిలువనున్నఈ పార్క్ వరంగల్ నగరానికి కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందన్నారు. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ ( పీఎం మిత్ర) కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఈ నెల 10 వ తేదీన ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శనివారం ఆయన ఆఫీసు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 1,327 ఎకరాల్లో విస్తరించిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు.. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ అని కిషన్ రెడ్డి తెలిపారు. పీఎం మిత్ర పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారిగా మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.
మోదీ 5 ఎఫ్ విజన్..
అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించిన ఈ పార్కు ద్వారా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా... ఫార్మ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్ అనే ప్రధాని మోదీ 5ఎఫ్ విజన్‌ను ఈ మెగా టెక్స్ టైల్ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
