బెంగళూరులో కెంపెగౌడ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ

బెంగళూరులో కెంపెగౌడ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ
  • 5జీ టెక్నాలజీని గత ప్రభుత్వాలు ఊహించలేదు
  • పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మనవైపే చూస్తోంది

బెంగళూరు: గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు స్పీడ్​గా పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశం ఇంకింత బాగుపడాలంటే రవాణా, ఎనర్జీ, రైల్వేలు వంటి రంగాలను మెరుగుపర్చడం..  వైద్యం, విద్య, ఇండ్ల నిర్మాణం వంటి సామాజిక, మౌలిక సదుపాయాలను పెంచడం అవసరమన్నారు. ఈ రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో సామర్థ్యంతో పనిచేస్తోందన్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మన దేశం సాధించిన పురోగతిని ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ వంటి ఆలోచనలు 2014కు ముందున్న ప్రభుత్వానికి ఊహకు కూడా అందలేదన్నారు. 

ప్రధాని మోడీ శుక్రవారం కర్నాటకలో పర్యటించారు. తొలుత విధాన సౌధ ఆవరణలోని కవి కనకదాసు, వాల్మీకి మహర్షి విగ్రహాలకు ఆయన నివాళి అర్పించారు. బెంగళూరులో 108 అడుగుల ఎత్తయిన ‘నాద ప్రభు’ కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో టెర్మినల్–2 ప్రారంభోత్సవం చేశారు. కర్నాటక గవర్నర్‌‌ తావర్‌‌చంద్‌‌ గెహ్లాట్‌‌, సీఎం బసవరాజ్‌‌ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌‌ జోషి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌‌ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. 

సౌత్​లో తొలి వందే భారత్ ప్రారంభం

సౌత్ ఇండియాలో తొలి వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. బెంగళూరు–మైసూరు–చెన్నై మధ్య నడిచే ఈ రైలును కేఎస్సార్ రైల్వే స్టేషన్​లో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ఆయన ప్రారంభించారు. 8 రోజుల టూర్ ప్యాకేజీతో ఈ రైలులో వారణాసి, అయోధ్య, ప్రయాగ్​రాజ్ వంటి తీర్థ స్థలాలను దర్శించుకోవచ్చు. రైళ్ల ప్రారంభం తర్వాత మోడీ మాట్లాడుతూ.. ఈ శతాబ్దపు ఇండియన్ రైళ్లు ఎలా ఉంటాయో చెప్పేందుకు వందే భారత్ రైలు ప్రతీక అని అన్నారు. వచ్చే పదేండ్లలో తమ ప్రభుత్వం ఇండియన్ రైల్వేలను ఇంకింత మెరుగుపరుస్తుందని చెప్పారు.