జీ20 లోగో ఆవిష్కరించిన ప్రధాని మోడీ

జీ20 లోగో ఆవిష్కరించిన ప్రధాని మోడీ
  • దేశానికి ఇది చారిత్రక సందర్భం
  • వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న టీ20 సమిట్ 
  • ఇండోనేషియా నుంచి మనకు డిసెంబర్ 1న బాధ్యతలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న జీ20 సమిట్‌‌కు సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌‌సైట్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. దేశానికి ఇది చారిత్రక సందర్భమని అన్నారు. ‘‘జీ20 సమిట్‌‌కు ఇండియా అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ప్రజలందరికీ అభినందనలు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం, విశ్వాసాన్ని లోగోలోని తామరపువ్వు వర్ణిస్తుంది” అని చెప్పారు. ఈ సందర్భంగా వెబ్‌‌సైట్‌‌ (www.g20.in )ను ప్రారంభించారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే మన మంత్రం ప్రపంచ సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. ‘‘జీ20 లోగోలోని చిహ్నం.. ఆశకు ప్రతిరూపం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తామర పువ్వు వికసిస్తూనే ఉంటుంది” అని అన్నారు.  ‘‘ఇది లోగో మాత్రమే కాదు.. ఓ సందేశం. మన నరనరాల్లో ఉండే అనుభూతి. ఇది మా ఆలోచనలో చేర్చుకున్న తీర్మానం’’ అని చెప్పారు. తామరపువ్వులోని 7 రెమ్మలు భూమిపై ఉన్న 7 ఖండాలను సూచిస్తాయని.. అలానే 
7 స్వరాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. 

ప్రపంచమే ఇంప్రెస్ అవుతున్నది 

‘‘స్వాతంత్ర్యం తర్వాత అభివృద్ధి శిఖరాలకు ప్రయాణాన్ని ఇండియా ప్రారంభించింది. ఇందులో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాల కృషి ఉంది. ప్రతి పౌరుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశారు” అని మోడీ కొనియాడారు. బ్రిటీష్ పాలనలో చీకటి రోజులను చూశామని, ఎన్ని సవాళ్లు ఎదురైనా.. ప్రతి కష్ట సమయాన్ని శక్తిగా ఇండియా మార్చుకున్నదని చెప్పారు. కొత్త ఇండియా నైపుణ్యాన్ని చూసి ప్రపంచం ఇంప్రెస్ అవుతున్నదని చెప్పారు. “మనం ముందుండాలని ప్రపంచం కోరుకుంటున్నది. ప్రపంచ అంచనాలకు మించి చేయడం మన బాధ్యత. 130 కోట్ల మంది సామర్థ్యాలకు ప్రాతినిథ్యం వహించడమే న్యూ ఇండియా’’ అని అన్నారు. ప్రపంచ అభివృద్ధికి భారతదేశం మరింతగా ఎలా దోహదపడుతుందనే దానిపై తమ ఆలోచనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని కోరారు.

వచ్చే ఏడాది 

ప్రస్తుతం జీ20 ప్రెసిడెన్సీ ఇండోనేషియా వద్ద ఉండగా.. డిసెంబర్ 1న ఇండియా ఆ బాధ్యతలను అందుకోనుంది. వచ్చే ఏడాది మన దేశంలో ఈ సమిట్‌‌ జరగనుంది. 32 రకాల సెక్టార్లలో 200కు పైగా సమావేశాలను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించనుంది. జీ20 సమిట్.. ఇండియా చరిత్రలో జరుగుతున్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా నిలవనున్నది. ప్రపంచ జీడీపీలో 85 శాతం పైగా జీ20 దేశాలదే. 75 శాతం ట్రేడ్‌‌ కూడా ఈ దేశాలే చేస్తున్నాయి.