తెలంగాణలో ఐదు సభలకు మోదీ.. 20 సభలకు అమిత్ షా

తెలంగాణలో ఐదు సభలకు మోదీ.. 20 సభలకు అమిత్ షా
  • రాష్ట్రవ్యాప్తంగా 45 మీటింగ్​లు 
  • ఎన్నికల ప్రచారంపై బీజేపీ కసరత్తు  

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల లిస్ట్ విడుదల కావటంతో ఇక ప్రచారాన్ని ముమ్మరం చేయడంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45 సభలు పెట్టేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసింది. ఇందులో ప్రధాని మోదీ 5, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 20, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మరో 20 సభలకు అటెండ్ అయ్యేలా రాష్ట్ర నేతలు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం నాలుగు హెలికాప్టర్లను బీజేపీ రాష్ర్ట నాయకత్వం బుక్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక 119 నియోజక వర్గాల్లో ఎక్కడెక్కడ సభలు పెట్టాలనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సైతం ఎన్నికల ప్రచారంపాల్గొననున్నారు. రానున్న రోజుల్లో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొనగా, అమిత్ షా ఆదిలాబాద్ సభకు హాజరయ్యారు. ఈ మూడు బహిరంగ సభలూ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ కేడర్ లో జోష్ నెలకొంది.