టెర్రరిజంపై కలిసి పోరాడుదాం.. ఆసియాన్ సమిట్‎లో ప్రపంచ దేశాలకు మోడీ పిలుపు

టెర్రరిజంపై కలిసి పోరాడుదాం.. ఆసియాన్ సమిట్‎లో ప్రపంచ దేశాలకు మోడీ పిలుపు

న్యూఢిల్లీ: టెర్రరిజంపై ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, భద్రతకు టెర్రరిజమే పెను సవాల్ అని, దీనిపై ఐక్యంగా పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‎లో జరిగిన ఆసియాన్ సమిట్‎లో మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‎గా ప్రసంగించారు. పదిహేనేండ్ల నాటి ఇండియా–ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందాన్ని గడువుకు ముందే రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

దీనివల్ల ఆర్థికపరమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. రెండు పక్షాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది ప్రపంచ స్థిరత్వానికి పునాదిగా నిలుస్తుందన్నారు. 2026వ సంవత్సరాన్ని ‘‘ఆసియాన్–ఇండియా ఇయర్ ఆఫ్ మారిటైమ్ కోఆపరేషన్’’గా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియాన్ కూటమికి ఇండియా గట్టి మద్దతు ఇస్తుందన్నారు. 

అలాగే ఆసియాన్–ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం అమలు కార్యాచరణ(2026–2030)కు ఆయన మద్దతు తెలిపారు. సముద్ర భద్రత కోసం ఆసియాన్–ఇండియా రక్షణ మంత్రుల మీటింగ్, నేవీ ఎక్సర్​సైజ్ నిర్వహించాలని కూడా ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమానికి ఇండియా తన వంతు సహకారం అందిస్తుందని, ఇందులో భాగంగా 400 మంది ప్రొఫెషనల్స్​కు రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని మోదీ చెప్పారు.