
- దాడులపై పాకిస్తాన్‌కు సమాచారం ఎందుకిచ్చారు?
- యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు
- అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు
- ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటయా?
- ట్రంప్ అబద్ధాలు చెబుతున్నడని మోదీ ప్రకటిస్తరా?
- ఆపరేషన్ సిందూర్‌ను 1971 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: మన బలగాల చేతులు వెనక్కి కట్టి పాకిస్తాన్ పైకి యుద్ధానికి పంపారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనే బలమైన సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. పాక్‌లోని సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడులు చేయొద్దని కట్టడి చేసి బలగాలను పంపించారని ఆరోపించారు. ఇది వారిని కంట్రోల్ చేయడమేనని, ఇలా చేయడం వల్ల యుద్ధ విమానాలు కూలిపోకుండా ఎలా ఉంటాయని రాహుల్ ప్రశ్నించారు. ఇండియా-–పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారని.. అది నిజం కాకుంటే ఆయన అబద్ధాలు ఆడుతున్నారని ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈమేరకు ఆపరేషన్ సిందూర్‌పై లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అంతకు ముందు మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పీచ్ పై రాహుల్ పలు అభ్యంతరాలను వెలిబుచ్చారు. రక్షణ మంత్రి తన స్పీచ్ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మీ దేశంలోని టెర్రర్ స్థావరాలపై మేం దాడి చేశాం. ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం మాకు లేదు. మీరు ప్రతీకార దాడులకు దిగొద్దని చెప్పానన్నారు’. ఆపరేషన్ చేపట్టిన అరగంట వ్యవధిలోనే శత్రువుకు ఫోన్ చేసి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసినట్లు రక్షణ మంత్రి స్వయంగా ఒప్పుకున్నట్లేనని రాహుల్ వివరించారు. అంటే కేంద్ర ప్రభుత్వమే పాకిస్తాన్ ను కాల్పుల విరమణ ఒప్పందానికి పిలిచిందని పరోక్షంగా రాజ్ నాథ్ వెల్లడించారని చెప్పారన్నారు.
దాడి చేసిన వెంటనే పాక్‌తో సంప్రదింపులు..
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ఆపరేషన్ సిందూర్ వివరాలు చెబుతూ పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘మే 7న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటలకు ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి, ఆ తర్వాత అరగంటకు ఉద్రిక్తతలు వద్దంటూ పాక్ కు ఫోన్ ద్వారా తెలియజేశామని రాజ్ నాథ్ చెప్పారన్నారు. ఇదెలా ఉందంటే ఇప్పుడు చెంపదెబ్బ కొట్టాను కానీ ఇకముందు కొట్టను అన్నట్లు ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన వెంటనే కాల్పుల విరమణ కోసం పాక్ తో సంప్రదింపులు జరిపామని, డీజీఎంవో ద్వారా ఫోన్ లో చర్చలు జరిపామని కేంద్రమంత్రి తనకు తానే బయటపెట్టాడని రాహుల్ చెప్పారు. మన యుద్ధవిమానాలు, పైలట్లు దాడులకు బయలుదేరుతుంటే సైనిక స్థావరాలపై కానీ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై కానీ దాడులు జరపొద్దని కట్టడి చేసినట్లు మంత్రి ఒప్పుకున్నారని వివరించారు. అంటే మన సైనికుల చేతులను వెనక్కి విరిచి కట్టేసి యుద్ధానికి పంపించినట్లేనని రాహుల్ ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ లో కొన్ని పొరపాట్లు చేశామని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పారని గుర్తుచేస్తూ ‘నిజానికి మీరు కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎలాంటి తప్పు చేయలేదు. రాజకీయ నాయకత్వమే తప్పుచేసిందని’ రాహుల్ పేర్కొన్నారు.
ట్రంప్ ఇప్పటికి 29 సార్లు చెప్పిండు..
ఇండియా–పాక్ యుద్ధాన్ని నేనే ఆపినా అంటూ అమెరికా అధ్యక్షుడు పదే పదే చెబుతున్నాడని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కాల్పుల విరమణ ప్రకటన కూడా తొలుత వాషింగ్టన్ నుంచే వెలువడింది. మోదీ సర్కారు మాత్రం కాల్పుల విరమణలో ఎవరి ప్రమేయంలేదని ప్రకటించిందన్నారు. ట్రంప్ అబద్ధమే చెబుతున్నాడని అనుకుంటే పదే పదే అదే అబద్ధం ఎందుకు చెబుతున్నట్లు అంటూ రాహుల్ గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సంధించారు. ట్రంప్ చెప్పేది అబద్ధమంటూ ఇప్పుడు ఈ సభలో ప్రకటించడానికి ప్రధాని మోదీకి ఉన్న అభ్యంతరమేంటని నిలదీశారు. అదేవిధంగా పాక్ ను ప్రపంచంలో ఒంటరిని చేశామని కేంద్రం ప్రచారం చేసుకుంటుండగా.. పాక్ మిలటరీ చీఫ్ అమెరికా వెళ్లి ఏకంగా అధ్యక్షుడు ట్రంప్‌తో లంచ్ చేసి వచ్చాడని రాహుల్ పేర్కొన్నారు.
1971 యుద్ధంతో పోలికా..?
ఆపరేషన్ సిందూర్ ను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ 1971 లో ఇండియా పాక్ ల మధ్య జరిగిన యుద్ధంతో పోల్చారని రాహుల్ చెప్పారు. ఈ రెండు యుద్ధాలు ఒకటెలా అవుతాయని ప్రశ్నిస్తూ పలు విషయాలను రాహుల్ పంచుకున్నారు. అప్పట్లో అగ్రరాజ్యం అమెరికా బెదిరించినా, సైనిక బలగాలు హిందూ మహాసముద్రంలో చొచ్చుకొస్తున్నా నాటి ప్రధాని ఇందిరా గాంధీ బెదరలేదని గుర్తుచేశారు. అమెరికా సైన్యం ముందుకు వస్తుందన్న వార్తలపై నాటి ప్రధాని స్పందిస్తూ.. ‘మీకు భయపడేటోళ్లు ఇక్కడెవరూ లేరు. మేం చేయాల్సింది చేసి తీరుతం’ అనే స్పష్టమైన సందేశాన్ని అమెరికాకు చాటిచెప్పారు. ‘‘బలమైన రాజకీయ సంకల్పమంటే అదీ” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ చేపట్టడానికి నాటి ఆర్మీ చీఫ్ మానెక్ షా 6 నెలల గడువు కావాలని కోరగా.. ఇందిరా గాంధీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెప్పారు. దీనివల్ల లక్ష మంది పాక్ సైనికులు లొంగిపోవడం, ప్రపంచ పటంలో ఓ కొత్త దేశం ఏర్పడిందన్నారు.