గుజరాత్​లో మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోడీ

గుజరాత్​లో మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న మోడీ

దీని ద్వారా ఎయిర్​ఫోర్స్​కు 56 ట్రాన్స్​పోర్ట్ ప్లేన్లు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో తొలిసారిగా ప్రైవేట్ కంపెనీలు మిలిటరీ ప్లేన్ ల నిర్మాణం చేపట్టనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో టాటా కంపెనీ, ఎయిర్ బస్ (యూరోపియన్ కంపెనీ) కలిసి ఎయిర్ ఫోర్స్ కోసం రవాణా విమానాలను తయారు చేయనున్నాయి. వడోదరలో రూ. 21,935 కోట్లతో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టుకు ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారని గురువారం డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ విమానాలను పౌర అవసరాలకు కూడా వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. 

వేలాది మందికి ఉపాధి అవకాశాలు

ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని డిఫెన్స్ సెక్రటరీ చెప్పారు.  మిలిటరీ టెక్నాలజీ, ఎక్విప్ మెంట్ కొనుగోలు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని ఈ ప్రాజెక్టు తగ్గిస్తుందన్నారు. ఎయిర్ బస్ నుంచి మొత్తం 56 రవాణా విమానాలు ( సీ295 ట్రాన్స్ పోర్ట్ ప్లేన్స్) కొనుగోలు చేసేందుకు కేంద్రం పోయిన నెలలో ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 16 విమానాలను యూరప్ లో తయారు చేసి, ఇండియాకు తీసుకొస్తారని, మిగతా 40 విమానాలను మన దేశంలోనే తయారు చేస్తారని డిఫెన్స్ సెక్రటరీ తెలిపారు. యూరప్ నుంచి 16 విమానాలు సెప్టెంబర్ 2023, ఆగస్ట్ 2025 మధ్యలో అందుతాయని, వడోదరలో మొదటి ప్లేన్ 2026 సెప్టెంబర్ కల్లా రెడీ అవుతుందన్నారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వద్ద ఉన్న పాత రవాణా విమానాల స్థానంలో  సీ295 ట్రాన్స్ పోర్ట్ ప్లేన్ లను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. సీ295 ట్రాన్స్ పోర్ట్ ప్లేన్ లు అతికొద్ది స్థలంలో కూడా ల్యాండింగ్, టేకాఫ్​కాగలవని, వీటి వెనకవైపు ఉండే ర్యాంప్ డోర్ ద్వారా వేగంగా బలగాలను, కార్గోను ప్యారా డ్రాపింగ్ చేయొచ్చన్నారు.