స్నేహితుల్ని కుబేరుల్ని చేసేందుకు ప్రజలను దోచుకుంటున్నరు

స్నేహితుల్ని కుబేరుల్ని చేసేందుకు ప్రజలను దోచుకుంటున్నరు

ప్రధాని మోడీపై కాంగ్రెస్  నేత రాహుల్  గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. తన స్నేహితుల్ని ధనవంతుల్ని చేసేందుకు సామాన్యులను ప్రధాని మోడీ దోచుకుంటున్నారని ట్వీట్ చేశారు. సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే.. మోడీ స్నేహితులు మాత్రం కుబేరులు అవుతున్నారన్నారు. ఇటీవల అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, మోడీని లక్ష్యంగా చేసుకొని కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.  అయితే డైరెక్టుగా అదానీ పేరు ప్రస్తావించకుండా రాహుల్, మోడీని విమర్శించారు. 

‘దేశంలో ప్రతి గంటకూ ఐదుగురు రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సమయంలోనే మోడీ ప్రియ మిత్రుడు 85 కోట్లు సంపాదిస్తున్నాడన్నారు. ఈ సందర్భంగా స్నేహితుల్ని కుబేరుల్ని చేసేందుకు ప్రజల్ని దోచుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. పేదల భారత్, ధనికుల భారత్ గా విభజిస్తోందన్న ఆయన.. హ్యాష్ ట్యాగ్ టు ఇండియన్స్ అనే ట్యాగ్ ను జతచేశారు.

ఇక జార్ఖండ్ లో ఇటీవల ప్రేమోన్మాది వికృత చేష్టలకు అంకితా సింగ్ అనే యువతి బలైంది. ఈ విషయంపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఆమెపై జరిగిన క్రూరత్వం ప్రతీ భారతీయుడు సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు. నేడు దేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం  ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ హింసకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా శిక్షించినప్పుడే అంకితకు, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.