మహిళలను రెచ్చగొట్టేందుకే కవిత దీక్షలు

మహిళలను రెచ్చగొట్టేందుకే కవిత దీక్షలు
  •      ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నం
  •     పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క 

అమ్రాబాద్, వెలుగు : మహిళలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే కవిత దీక్షల పేరుతో డ్రామాలు చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌ మండలం మాచారం గ్రామంలో శనివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం గత పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని విమర్శించారు. జీవో నంబర్‌‌‌‌‌‌‌‌ 3 ప్రకారం అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని తిడితే గొప్పోళ్లం అయిపోతామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

 గత ప్రభుత్వం గడీల పాలనకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మహిళలకు ప్రయారిటీ ఇస్తోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ నాటకం ఆడుతోందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తప్పనిసరిగా 33 శాతం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ అమలవుతుందని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ వంశీకృష్ణ, అనూష ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ అధినేత అండవల్లి జలంధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో సంకార నేత్రాలయ సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 

గ్రామాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయన్నారు. అనంతరం ఆమె కంటి పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివాసీ చెంచులు, ఐటీడీఏ సీఆర్టీలు, మండల, జిల్లా మహిళా సమాఖ్య ఉద్యోగులు, ఎన్‌‌‌‌‌‌‌‌పీఎం, జూనియర్‌‌‌‌‌‌‌‌ పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ, వీవోఏలు, పోడు రైతులు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.