సచివాలయంలోకి నో ఎంట్రీ... రాజాసింగ్‌కు చేదు అనుభవం

సచివాలయంలోకి నో ఎంట్రీ... రాజాసింగ్‌కు చేదు అనుభవం

తెలంగాణ కొత్త సచివాలయం వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం  ఎదురైంది. బుల్లెట్ బండిపై వచ్చిన రాజాసింగ్ ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.  గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన్ను సచివాలయంలోకి అనుమతించలేదు. దీంతో రాజాసింగ్ అక్కడి నుంచి వెనుదిరిగారు.  సచివాలయంలోకి  వెళ్లకుండా తనని అడ్డుకోవడంపై రాజాసింగ్ మండిపడ్డారు.  

సిటీ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉందని మంత్రి తలసాని పిలిస్తేనే సచివాలయానికి వచ్చానని రాజాసింగ్ అన్నారు.  ఎమ్మెల్యేలకే సచివాలయంలోకి అనుమతి లేకుంటే  ఇక  సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన  ప్రశ్నించారు.  ప్రజల డబ్బుతో కట్టిన సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులను అనుమతించకపోవటం సిగ్గుచేటన్నారు.  

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. ఇదే విషయాన్ని మంత్రి పేషీ కూడా చెబుతుతోంది. తాము ఆహ్వానం పంపామని, రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి పేషీ ప్రకటించింది.