ప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై ఎక్కడికక్కడ పడిపోతున్న జనాలు

ప్లాస్టిక్ కంపెనీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై ఎక్కడికక్కడ పడిపోతున్న జనాలు

విశాఖపట్టణంలోని గోపాలపట్టణంలో ఉన్న ఎల్.జి. పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహ ముగ్గురు చనిపోయారు. వీరిలో ఇద్దరు వృద్ధులు విషవాయువుల వల్ల కళ్లు కనిపించక బావిలో పడి చనిపోయారు. చిన్నారి మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. విష వాయువులు మూడు కిలోమీటర్ల మేరకు వ్యాపించాయి. గ్యాస్ లీకేజీతో అక్కడి చుట్టుపక్కల ప్రజలు చాలామంది అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అస్వస్థతకు గురైన వారికి స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ దాదాపు 80 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీక్ అవడంతో ఆర్.ఆర్. వెంకటాపురం పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లాక్డౌన్ తో మూసేసిన ఫ్యాక్టరీ ఇన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ తయారీకి వాడే స్టైరిన్ కార్బన్ తెల్లవారుజామున 3 గంటలకు కంపెనీ నుంచి లీకైనట్లు అధికారులు గుర్తించారు. గ్యాస్ లీకేజీ వల్ల చర్మంపై దద్దర్లు, కళ్లలో మంటలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇబ్బందులు పడుతున్న వారందరినీ అంబులెన్స్ లో కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కవగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. కంపెనీ ముందు నుంచి వెళ్తున్న వాళ్లు కూడా ఎక్కడికక్కడ పడిపోతున్నారు. దాంతో కంపెనీకి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. స్థానిక జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. ఘటనాస్థలానికి కలెక్టర్ వినయ్ చంద్, కమిషనర్ ఆర్.కే. మీనా మరియు ఉన్నతాధికారులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి అవంతి శ్రీనివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఘటనపై అధికారులను ఆరా తీశారు.