లాక్ డౌన్ కఠినంగా అమలు..లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు

లాక్ డౌన్ కఠినంగా అమలు..లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు

రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం 10 దాటితే లాఠీలకు  పని చెబుతున్నారు. అనవసరంగా  రోడ్లపైకి వస్తే..  కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఇన్ని రోజుల వరకు చూసి  చూడనట్టు  వదిలేశారు. ఇవాళ  మాత్రం  లాఠీలకు పనిచెప్పారు.

లాక్ డౌన్  మొదలైనప్పటి నుంచి  ఇంత సీరియస్ గా  పోలీసులు ఎప్పుడూ   యాక్షన్ తీసుకోలేదు. మూడు రోజుల  నుంచి  కాస్త కఠినంగా  వ్యవహరిస్తున్నారు. ఇవాలైతే  తొలిసారిగా  లాఠీలెత్తారు  పోలీసులు. పది దాటిన తర్వాత రోడ్లపైకి వస్తే కారణాలు అడిగి పంపిస్తున్నారు. ఎలాంటి కారణాలు లేకుండా బయటకు వచ్చినవారిపై ఫైన్లు, బండ్లు సీజ్ చేస్తున్నారు. ఐడెంటిటి కార్డులు, ఎమర్జెన్సి పాసులు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు.  

కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. మరోవైపు సైబరాబాద్ లో రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉందన్నారు పోలీస్ కమిషనర్ సజ్జనార్. 8 తర్వాత రోడ్డెక్కితే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు.

వెస్ట్ జోన్ పరిధిలోని లంగర్ హౌస్, గోల్కొండ, ఆసిఫ్ నగర్ పోలీసులు వారివారి పరిధిలోని చెక్ పోస్టుల వద్ద భారీ వాహన తనిఖీ నిర్వహించారు. అనుమతులు లేకుండా రోడ్లపైకి  వచ్చిన వాహనాలను పోలీసులు జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేశారు.లంగర్ హౌస్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద ఓ వాహనదారుడు  పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు వాహనాన్ని ఆపకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. షేక్ పేట వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్దకు  ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు.