స్టేషన్ లో రాత్రంత దీక్ష చేసిన బండి సంజయ్

స్టేషన్ లో రాత్రంత దీక్ష చేసిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష దగ్గర రాత్రంతా హైడ్రామా కొనసాగింది. అర్ధరాత్రి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మానకొండూర్ పోలీస్ స్టేషన్ నుంచి  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. రాత్రి కరీంనగర్ లోని ఎంపీ ఆఫీసులో దీక్షకు దిగిన సంజయ్ ని ఉద్రిక్తతల మధ్య అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లాఠీచార్జీ చేసి, కార్యాలయం లోకి వాటర్ కెనాన్ ప్రయోగించి, గ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి, రాడ్లతో డోర్లు పగులగొట్టి.. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన లాఠీచార్జీలు పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. సంజయ్ ను రాత్రంతా మానకొండూరు స్టేషన్ లో ఉంచారు పోలీసులు. దీంతో స్టేషన్ లోనే దీక్ష కొనసాగించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. 

ఉదయం సంజయ్ ను మానకొండూర్ PS నుంచి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు పోలీసులు. సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇందుకోసం అంబులెన్స్ ను తెప్పించారు. ఇక దీక్షపై చట్టపరంగా చర్యలకు సిద్ధమయ్యారు పోలీసు అధికారులు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద బండి సంజయ్ తో పాటు మరో 12 మంది నేతలు, ఇతర కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అటు సంజయ్ అరెస్ట్ తో ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. సంజయ్ అరెస్ట్ తీరుపై మండిపడ్డారు పార్టీ నేతలు.