వెబ్ సిరీస్ లు చూసి : హైదరాబాద్ లో ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేస్తున్న కేటుగాళ్లు..

వెబ్ సిరీస్ లు చూసి : హైదరాబాద్ లో ఇంట్లోనే డబ్బులు ప్రింట్ చేస్తున్న కేటుగాళ్లు..

డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఎంతున్నా సరిపోదు.. అసలు లేకపోతే ఏం చేసైనా డబ్బు సంపాదించాలి.. ఇదే ఇప్పుడు మనిషి ఆలోచన.. ఈ క్రమంలోనే ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఇద్దరు వ్యక్తులు.. డబ్బుల కోసం ఏకంగా ఇంటిని అద్దెకు తీసుకుని.. నకిలీ నోట్లు తయారీ కేంద్రం పెట్టేశారు. సివిల్ కాంట్రాక్టర్ అయిన వెంకటేశ్వర్లు.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో.. తన స్నేహితుడు శ్రీనివాస్ తో కలిసి నకిలీ నోట్ల తయారీ సెంటర్ ఓపెన్ చేశారు. 

దీని కోసం ప్రింటర్లు, పెద్ద జిరాక్స్ మెషీన్.. ల్యాప్ ట్యాప్, కలర్స్ వంటి సామాగ్రి కోసం ఏడు లక్షలు ఖర్చు చేశారు. శంషాబాద్ ఏరియాలో ఇంటిని అద్దెకు తీసుకుని.. వాళ్లకు ఉన్న పరిజ్ణానంతో.. వెబ్ సిరీస్ లు చూసిన నాలెడ్జ్ తో నోట్లను తయారు చేయటం మొదలుపెట్టారు. ఇలా తయారు చేసిన 500, 100 నకిలీ నోట్లను రాత్రి సమయాల్లో కూరగాయల షాపుల్లో, పాలబూతుల్లో, కిరాణాషాపుల్లో.. రైతు బజార్లలో.. రోడ్డు పక్కన పండ్లు, ఇతర వస్తువులు అమ్మే వాళ్ల దగ్గర మార్చటం మొదలుపెట్టారు.

నకిలీ నోట్ల తయారీపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిఘా పెట్టి పట్టుకున్నారు. వారి నుంచి 2 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే.. ఇలా చేస్తున్నామని.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒక ఒరిజినల్ నోటుకు.. మూడు నకిలీ నోట్లు ఇస్తున్నామని.. గ్రామాల్లోని చిన్న చిన్న షాపుల్లో వీటిని మారుస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు ఇలా తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి అయితే దొంగలు దొరికారు.. ఇక మార్కెట్ లో వీళ్లు విడుదల చేసిన నోట్లు మార్పిడి కాకుండా కట్టడి కావాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఇటీవల కాలంలో OTTల్లో వస్తున్న వెబ్ సిరీస్ ల మహత్యం.. ఈజీగా.. నకిలీ నోట్లు ప్రింట్ చేసేస్తున్నారు..