
బషీర్‌బాగ్, వెలుగు: మ్యాట్రిమొనీ పేరుతో ఓ వ్యక్తిని చీటింగ్ చేసి డబ్బులు కొట్టేసిన ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ దార కవిత వివరాల ప్రకారం.. 2023 మార్చిలో 33 ఏళ్ల వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఓ యువతి ప్రొఫైల్ నచ్చడంతో అందులో ఉన్న నంబర్ కు కాంటాక్ట్ అయ్యాడు. ఇదే అదనుగా సదరు యువతి యువకుడికి దగ్గరైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. వివిధ కారణాలతో రూ.25 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకుంది.
ఇన్‌స్టా ఫ్రొఫైల్లో అప్లోడ్ చేసిన ఫొటో పాకిస్తాన్ కు చెందిన నటిది అని బాధితుడు గుర్తించాడు. డబ్బులు రిటర్న్ చేయాలని కోరగా స్కామర్లు బాధితుడి కాంటాక్ట్ ను బ్లాక్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కర్నాటకకు చెందిన అనీసా మహ్మద్ యసీన్ (33), జోహార్ ఫాతిమా(24) ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.
వీరికి మహ్మద్ అబ్దుల్ అమీర్ అనే వ్యక్తి సహకరించాడు. శుక్రవారం యసీన్, అమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఫోన్లు, ట్యాబ్, ల్యాప్ టాప్ , 5 బ్యాంక్ పాస్ బుక్స్, 3 చెక్ బుక్స్, 3 డెబిట్ కార్డులను సీజ్ చేశారు. ఫాతిమా పరారీలో ఉన్నట్లు తెలిపారు.