- అవినీతి అధికారులు, చోరీలకు పాల్పడినవారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు
- మీడియాలో వార్తలు చూసి.. నిందితుల ఫ్యామిలీల బ్లాక్‍మెయిల్
- వచ్చిన డబ్బులతో బెట్టింగులు, అమ్మాయిలతో ఎంజాయ్
- నిందితుడు శ్రీనివాస్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- వివరాలు తెలిపిన వరంగల్ సీపీ
వరంగల్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన ఓ వ్యక్తి నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారమెత్తాడు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి పుట్టపర్తి జిల్లా నల్లమాడు మండలం వేలమద్దికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగళ శీను (45) మొదట బైక్ చోరీలు, చైన్స్నాచింగ్లాంటి దొంగతనాలు చేసేవాడు. అతని మీద ఇప్పటికే 78 కేసులుండగా పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తాజాగా నకిలీ ఏసీబీ డీఎస్పీ అవతారమెత్తి.. వరంగల్లో ఓ ఆర్టీఏ ఆఫీసర్‍ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసి పోలీసులకు చిక్కాడు.
కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్సన్ పీత్‍సింగ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈజీమనీ కోసం శీను 2002లో బైక్ దొంగతనాలు మొదలు పెట్టాడు. ఆ తర్వాత పలు నేరాలకు పాల్పడుతూ నకిలీ పోలీస్‌ఆఫీసర్ అవతారమెత్తాడు. రాయలసీమ ప్రాంతంలో చోరీ కేసుల్లో అరెస్టయి జైలుకెళ్లిన వారి కుటుంబాలను టార్గెట్ చేసి.. రికవరీ పేరిట కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు, బంగారం వసూలు చేశాడు. దాదాపు 50 మందిని రికవరీ పేరిట నిలువునా ముంచగా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41 పైగా చైన్ స్నాచింగులకు పాల్పడటంతో మరోసారి అరెస్టయ్యాడు.
ఈసారి బయటకు వచ్చిన శీను.. ఏసీబీ డీఎస్పీనని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. తెలంగాణ, ఏపీలో రిటైర్మెంట్‍దగ్గర ఉండే అధికారులు, అవినీతి ఆరోపణలున్న వారిని కలసి మీపై కంప్లైంట్ వచ్చిందని, అవినీతికి సంబంధించి ఆధారాలున్నాయంటూ బ్లాక్‍మెయిల్ చేసేవాడు. ఏసీబీ కేసుల్లో ఉన్నవారి కుటుంబసభ్యులకు కూడా ఫోన్లు చేసి అవినీతిలో మీ సహకారం కూడా ఉందని తేలిందంటూ బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఇలా తెలంగాణలో 9 మందిని, ఆంధ్రాలో 10 మందిని మోసగించి రూ.50 లక్షలకుపైగా వసూలు చేశాడు. ఇలా వచ్చిన డబ్బులతో ఆన్‍లైన్‍బెట్టింగులు, గోవాలో జూదం ఆడటంతో పాటు వ్యభిచార గృహాల్లో ఖర్చుచేసేవాడు.
వరంగల్ పోలీసులకు చిక్కాడిలా..
ఇటీవల వరంగల్ ఆర్టీఏలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ త్వరలో రిటైర్ కానున్న తుమ్మల జైపాల్ రెడ్డికి శ్రీనివాస్ ఫోన్ చేసి అవినీతి ఆరోపణలున్నట్టు కంప్లైంట్ వచ్చిందని, కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి రూ. 10 లక్షలు వసూలు చేశాడు. అనుమానం వచ్చిన జైపాల్ రెడ్డి వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీ ఆధారంగా విచారించిన మిల్స్‌కాలనీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శ్రీనివాస్‍తో పాటు అతనికి సహకరించిన కర్నాటకలోని రాంనగర్ జిల్లాకు చెందిన నవీ న్జేఆర్, బెంగళూరుకు చెందిన మంగళ రవీందర్, మురళీ, ఎన్. ప్రసన్నను అరెస్ట్ చేశారు.
సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నారు. శీనును పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్‍జోన్ డీసీపీ డి.కవిత, వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు ఎల్. పవన్‍కుమార్, కె.శ్రీధర్, ఎల్.మంగీలాల్, మిల్స్‌కాలనీ సీఐ బి.రమేశ్ తదితరులకు సీపీ సన్‍ప్రీత్ సింగ్‍రివార్డులు అందించారు. 23 ఏండ్లుగా 78 బైక్ చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు చేసిన రాచంపల్లి శ్రీనివాస్ పై పీడీ యాక్ట్ పెట్టనున్నట్టు సీపీ సన్‍ప్రీత్‍సింగ్ చెప్పారు.
