హరీశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్తత

హరీశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..అప్పా జంక్షన్ దగ్గర ఉద్రిక్తత

పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు,  సబితా ఇంద్రారెడ్డి కారులో వెళ్తుండగా అప్పా జంక్షన్ దగ్గర అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని  శంషాబాద్  రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసి అడ్డుకున్నా పరిగికి వెళ్లి భూములు కోల్పోతున్న ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతుల తరపున పోరాటం చేస్తామని హరీశ్ రావు అన్నారు.  హరీశ్ అరెస్ట్ కు నిరసనగా పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు బీఆర్ఎస్  కార్యకర్తలు. దీంతో కాసేపు పోలీసులకు ,బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ లో ఇండస్ట్రీయల్ పార్క్ భూబాధితుల ఆందోళన  కొనసాగుతోంది.  గ్రామంలో టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నారు రైతులు. పేద రైతుల భూములు లాక్కుంటే ఊరుకునేదే లేదంటున్నారు.  సాగుకు అనుకూలంగా లేని భూములలో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవాలని రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు. మరో నాలుగు రోజులు వేచి చూస్తాం...ప్రభుత్వం తరపున సానుకూలంగా నిర్ణయం రాకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  రోడ్లపై బైటాయించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేస్తామని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.