‘హరీశ్​అన్న సేవా సమితి’ పేరుతో మోసాలకు ప్లాన్.. ఇద్దరిని అరెస్ట్​చేసిన పంజాగుట్ట పోలీసులు

‘హరీశ్​అన్న సేవా సమితి’ పేరుతో మోసాలకు ప్లాన్.. ఇద్దరిని అరెస్ట్​చేసిన పంజాగుట్ట పోలీసులు

ఖైరతాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావు పేరుతో మోసాలకు స్కెచ్​వేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం..  బహదూర్ పల్లికి చెందిన పేరాల వెంకటేశ్ మంత్రి హరీశ్ రావు వెంట ఉంటూ ఆయనను కలిసే వ్యక్తులు, వ్యాపారవేత్తలను పరిచయం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ‘హరీశ్ అన్న సేవా సమితి’ పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి, కూకట్‌పల్లి  వివేకానంద కాలనీ కార్యాలయ చిరునామాగా ఓ పుస్తకాన్ని ముద్రించాడు.

గుండాల మల్లేశ్ గౌడ్ అనే వ్యక్తి పేరును అతడికి తెలియకుండానే పుస్తకంలో సమితి అధ్యక్షుడిగా చేర్చి, తాను ఉపాధ్యక్షుడిగా, తన సహచరుడు గడ్డమీది రాజేశ్​కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా చూపించాడు. ఆపై మంత్రి పుట్టినరోజు పేరు చెప్పి బీఆర్​ఎస్ పార్టీ నాయకులు, ప్రముఖ బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలను సంప్రదించేందుకు ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే గుండాల మల్లేశ్ నుంచి ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంకటేశ్, రాజేశ్ ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రిసిప్ట్ బుక్, 4 సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.