ఫొటోలు వైరల్ చేస్తామని యువతికి బెదిరింపులు

ఫొటోలు వైరల్ చేస్తామని యువతికి బెదిరింపులు
  •     ఇద్దరు నిందితుల అరెస్టు

ఘట్ కేసర్, వెలుగు: పర్సనల్ ఫొటోలు వైరల్ చేస్తామని యువతిని బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇన్ స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. రియాజ్ అలీ అనే వ్యక్తి తన మొబైల్​ను పట్టణంలోని శాంతినగర్​కు చెందిన జ్ఞానేశ్వర్ వద్ద తాకట్టు పెట్టాడు. 

రియాజ్ ఫోన్ లాక్​ను ఓపెన్ చేసిన జ్ఞానేశ్వర్..  అతని స్నేహితురాలితో ఉన్న పర్సనల్ ఫొటోలను వాట్సాప్ ద్వారా తన మిత్రుడు హేమంత్​కు పంపించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఈ ఫొటోలను సదరు యువతికి పంపించి వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ఘట్​కేసర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.