
- సిటీ మీదుగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు : వైజాగ్ నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మాదాపూర్ ఎస్ వోటీ, కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ సందీప్ కేసు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన రాజుభాయ్ ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్‌కు స్కెచ్ వేశాడు. ఏపీలోని వైజాగ్ నుంచి గంజాయిని కొని మహారాష్ట్రకు తరలించేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకోసం మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన డ్రైవర్ కార్తీక్ రవికిరణ్ దేశ్‌ముఖ్(24), శోభానగర్ పరిధి బుద్దవిహాం ప్రాంతానికి చెందిన డ్రైవర్ కమల్ సంజయ్ సిర్సాత్(23)ను సంప్రదించాడు. రాజుభాయ్, కార్తీక్, కమల్ ముగ్గురు కలిసి కారులో వైజాగ్ లోని ఏజెన్సీ ఏరియాకు వెళ్లి రూ.3 వేలకు కిలో చొప్పున గంజాయిని కొన్నారు. దాన్ని ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి ఈ నెల 3న కార్తీక్, కమల్ కారులో సిటీకి బయలుదేరారు.
అదే రోజు రాజుభాయ్ వైజాగ్ నుంచి మహారాష్ట్రకు ట్రైన్ లో బయలుదేరాడు. సోమవారం ఓఆర్ఆర్ మీదుగా కార్తీక్, కమల్ సిటీ దాటుతున్నట్లు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ వోటీ, కొల్లూరు పోలీసులు వారిపై నిఘాపెట్టారు. కారును అడ్డుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 42 లక్షల విలువైన 125 కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రైన్లో మహారాష్ట్రకు వెళ్లిన రాజుభాయ్, వైజాగ్ లో వీరికి గంజాయిని అమ్మిన రాజా అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్తీక్, కమల్ ను రిమాండ్ కు తరలించామన్నారు. మీడియా సమావేశంలో ఏడీసీపీ నర్సింహారెడ్డి. కొల్లూరు ఇన్ స్పెక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
గంజాయి అమ్ముతున్న మరో ఇద్దరు అరెస్ట్
ఉప్పల్ : గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకానగర్ కు చెందిన నడిగొండ భరత్(21), అంబర్ పేటకు చెందిన కింగోల్ చండీశ్వర్ అలియాస్ చింటూ(20) ఇద్దరూ ఫ్రెండ్స్ గంజాయికి బానిసయ్యారు. జల్సాల కోసం గంజాయి అమ్మడం మొదలుపెట్టారు. దూల్ పేటలో తక్కువ ధరకు గంజాయిని కొని సిటీలోని ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు.
సోమవారం ఉప్పల్ కమాన్ వద్ద గంజాయి అమ్మేందుకు యత్నిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.