
ఎల్బీనగర్, వెలుగు: రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయించే ప్రయత్నం చేసిన వ్యక్తిని మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ లోని రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసులో సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన లోకేశ్ బరేత్జ్(26) తన మిత్రుడు జగదీశ్గుజ్జర్ కలిసి హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు ఓపీఎం డ్రగ్స్ ను సప్లయ్ చేయాలని ప్లాన్ చేశాడు.
ఆగస్టులో జగదీశ్గుజ్జర్ ఆదేశాలతో లోకేశ్ బరేత్ రాజస్థాన్ నుండి రైలులో హైదరాబాద్ కు వచ్చి కాచిగూడ రైల్యే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తికి 2 కిలోల నల్లమందు అందజేసి వెళ్లాడు. మరోసారి శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుండన్ పల్లి ఓఆర్ఆర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తికి డ్రగ్స్ ను అప్పగించేందుకు వేచి ఉండగా మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు లోకేశ్బరేత్జ్ ను శుక్రవారం అరెస్టు చేశారు.
రూ.కోటి విలువైన ఓపీఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జగదీశ్ గుజ్జర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, భువనగిరి ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ ఎస్జీటీ అంజయ్య పాల్గొన్నారు.