సికింద్రాబాద్ ఘటనతో సంబంధం లేకున్నా.. కానిస్టేబుల్ సస్పెండ్

సికింద్రాబాద్ ఘటనతో సంబంధం లేకున్నా.. కానిస్టేబుల్ సస్పెండ్
  • సికింద్రాబాద్ ఘటనతో సంబంధం లేదు
  • కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ

కరీంనగర్: డిఫెన్స్ అకాడమీ/పోలీస్ కోచింగ్ సెంటర్ నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న కరీంనగర్ కు చెందిన కానిస్టేబుల్ రాజును సస్పెండ్ చేస్తూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల సికింద్రాబాద్ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆర్మీ, డిఫెన్స్ అకాడమీ, పోలీసు కోచింగ్ సెంటర్లలో సోదాలు.. తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా కానిస్టేబుల్ రాజు దీర్ఘకాలికల సెలవులో ఉండి డిఫెన్స్/పోలీస్ కోచింగ్ సెంటర్లలో నిర్వహణలో పాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలపై దృష్టి సారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కానిస్టేబుల్ రాజు గత కొంత కాలంగా నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి ఇతర ప్రైవేటు (వ్యాపార) కార్యకలాపాలలో పాల్గొనడంపై సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులు. కానిస్టేబుల్ రాజుకు సికింద్రాబాద్ ఘటనలతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ అయినప్పటికీ కోచింగ్ సెంటర్ నిర్వహణలో భాగస్వామ్యం ఉండడం నిబంధనలకు విరుద్ధమని పరిగణిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.