
హైదరాబాద్ : కోటి రూపాయల విలువైన నగల చోరీ కేసు ఛేదించారు పోలీసులు. బంజారాహిల్స్ లో ఈనెల 9న బ్యాగ్ లో నగలు మాయమైన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 143 తులాల బంగారు నగలను సీజ్ చేశారు. వీటి విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రధాన నిందితుడు నిరంజన్ సహా మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు.
ఆరోజు బైక్ పై నగల బ్యాగ్ తో వెళ్లిన జ్యుయెలరీ షాప్ ఉద్యోగి .. వర్షాల కారణంగా కిందపడ్డాడనీ… వాటర్ లో బ్యాగ్ కొట్టుకుపోయిందని పోలీసులు చెప్పారు. కొద్దిదూరంలో ఖాళీ బ్యాగ్ కనిపించడంతో.. తమకు ఫిర్యాదు చేశారనీ… దర్యాప్తులో నిందితుల నుంచి బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు. వరద నీటికి దగ్గర్లోనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న నిరంజన్ కు బ్యాగ్ దొరికిందన్నారు. బంధువుల సాయంతో నగలను దొంగిలించి.. బ్యాగ్ ను అక్కడే వదిలేసి.. నాగర్ కర్నూలు పారిపోయారు నిందితులు. తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేశారు. సీసీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్, టెక్నాలజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.