
హైదరాబాద్: మైనర్లు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. డ్రైవింగ్ మీద ఉన్న పిచ్చితో చిన్నతనంలోనే వాహనాలు నడిపి ప్రమాదాల్లో వారి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ALSO READ | హైదరాబాద్లో విషాదం.. హార్పిక్ తాగిన భార్యాభర్త.. కడుపులో పేగులు కాలిపోయి భార్య మృతి
డ్రైవింగ్ చేస్తూ దొరికిన మైనర్ల తల్లిదండ్రులకు తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లను జువైనల్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఏడాది పాటు వాహనం లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తున్నారు. వాహనం నడుపుతూ దొరికిన మైనర్లకు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ కాకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మైనర్ల తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారకులు కావొద్దని సూచించారు.
మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం: ఎస్పీ అఖిల్ మహాజన్
మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల పాటు స్పెషల్ మైనర్ డ్రైవింగ్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లు నడిపిన 295 వాహనాలను సీజ్ చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది ఫస్ట్ కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నామని.. ఇక నుంచి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మైనర్లు వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 18 సంవత్సరాలు పై బడిన లైసెన్స్ లేని వారు లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.