
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని జైలుకు పంపిచారు. వీడియోలో యువకుడు మాట్లాడిన తీరు ఇలా ఉంది. రైతుబంధు స్కీం పెద్ద మోసం అని తెలిపాడు. ఎక్కువ ఎకరాలు ఉన్న సంపన్నులే ఈ పథకంతో లబ్ది పొందుతున్నారని చెప్పాడు. పేద రైతులకు ఇవ్వడం ఓకే. కానీ.. 100 ఎకరాలున్నవారికి కూడా రైతుబంధు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. రెవిన్యూలోనూ లంచాలు పెరగడం సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్కువ జరుగుతున్నాయన్నారు. రైతులకు రైతుబంధు ఎంట్రీ చేయాలన్నా రెవిన్యూకు లంచాలు ఇవ్వాల్సిందేనన్నాడు. ముసలోల్లకు పెంచిన పించనుతో సామాన్యుడికి మరింత భారం పడుతుందన్నాడు. నిత్యవసర ధరలు పెంచుతున్నావని కేసీఆర్ ను ప్రశ్నించాడు.
రైతులు, ముసలోల్ల పేరుతో కేసీఆర్ పెద్ద మోసం చేస్తున్నాడని చెప్పాడు. కాళేశ్వరం పేరుతో బడ్జెట్ లో వేల కోట్లు కేటాయిస్తున్నారని ..అవి ఎక్కడికి పోతున్నాయో తెలియడంలేదన్నాడు. జాబ్స్ విషయం గాలికి వదిలేసిన కేసీఆర్..వచ్చే లోన్లు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారన్నాడు. విద్యార్థుల కాలికి ముళ్లు గుచ్చుకుంటే నోరుపెట్టి పీకుతా అన్న కేసీఆర్..మీరు ఇప్పటివరకు పీకింది ఏమిటని కౌంటర్ ఇచ్చాడు మంచిర్యాల జిల్లాకు చెందిన కాసిపేట వాసి సమేల్ కుమార్. దీనిపై స్థానిక టీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి బెల్లంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. 15రోజుల రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు కాసిపేట SI భాస్కర్ రావు. యువకుడికి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసి అసిఫాబాద్ జైలుకు తరలించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎంటాయని హెచ్చరించారు పోలీసులు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..కరెక్ట్ మాట్లాడితే జైల్లో పెడుతారా అంటూ సీఎం కేసీఆర్ పై సీరియస్ అవుతున్నారు నెటిజన్లు.