ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: వెలుగుమట్ల భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. కవితతో సహా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కవితను పీఎస్ కు తరలించారు. 43 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పోలీసులకు,జాగృతి కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు.
బాధితులకు కూల్చిన ఇండ్ల స్థానంలో మళ్లీ కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. బాధితులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ వచ్చి చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బాధితులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కవిత, విశారదన్ తో పాటు బాధితులను అరెస్ట్ చేశారు. కవితను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు, జాగృతి నాయకులను, బాధితులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం పొద్దుపోయాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఆమె రాత్రి 9 గంటల సమయంలో విశారదన్ తో కలిసి అంబేద్కర్ భవన్ వెళ్లి నిరవధిక దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం, మంత్రులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాపాలను కడుక్కునే ప్రయత్నంలో బీఆర్ఎస్
అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు ముందు కూల్చివేతల బాధితులతో కవిత మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వెలుగుమట్లలో ఇండ్లను కూల్చే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా ఇండ్లను కూల్చేశారని, బాధితుల ఉసురు కచ్చితంగా ప్రభుత్వానికి, ఇక్కడి నేతలకు తగులుతుందన్నారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదని, అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ‘‘మీ ఇండ్లు కూల్చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లారు. మీ ఆవేదన, బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ గా మారింది. నన్ను కూడా తొందరగా ఇక్కడకు వెళ్లు అని చాలా మంది చెప్పారు. నేను ఏదో మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదు. మీ సమస్యలు విని వాటిపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు వచ్చాను. అంతవరకు పోరాటం చేద్దాం. మనల్ని ఓ కొట్టంలోకి తోలినట్లు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టేశారు. కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదు. బీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంప్ పెట్టి, పాపాలు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదు. మన ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో అక్కడే కొత్తగా ఇండ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటకు వెళ్లమంటే వెళ్లేది లేదు” అని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం కూడా పేదల మీద జులుం నడుస్తోందని, పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపుతున్నారని ఆరోపించారు.
43 మందిపై కేసులు నమోదు.
జడ్పీ సెంటర్ లో మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగించడంతో పాటు పోలీస్ విధులను ఆటంకపరిచిన కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజు సహా 43 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. వీరిలో 33 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారని చెప్పారు. విధుల్లో ఉన్న మహిళా పోలీస్ సిబ్బందిపై దాడులు చేశారని, వీడియో ఫుటేజ్ పరిశీలించి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
