రష్యా నుంచి రిమోట్..యూపీలో ఫేక్ క్రికెట్ లీగ్

రష్యా నుంచి రిమోట్..యూపీలో ఫేక్ క్రికెట్ లీగ్

గుజరాత్లో ఫేక్ క్రికెట్ లీగ్ పేరుతో బెట్టింగ్ మోసం మరవకముందే ఉత్తరప్రదేశ్లో అదే తరహాలో  ఫేక్ క్రికెట్ లీగ్ ముఠా గుట్టు రట్టయింది. బిగ్ బాస్ టి 20 పంజాబ్ లీగ్ పేరుతో నకిలీ క్రికెట్ లీగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.  మీరట్‌లోని క్రికెట్ మైదానంలో "క్రిక్ హీరోస్" పేరుతో మొబైల్ అప్లికేషన్ ద్వారా మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.  రష్యా రాజధాని మాస్కో వేదికగా ఈ ఫేక్ క్రికెట్ లీగ్ను నడిపించారని చెప్పారు. ఈ ఫేక్ క్రికెట్ లీగ్ వ్యవహారంలో షితాబ్ అలియాస్ షబ్బు,రిషబ్‌లను మీరట్ బైపాస్ రోడ్డు సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.15,150 నగదు, 7800 శ్రీలంక కరెన్సీ, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, రెండు కెమెరాలు, ఒక ఎల్‌సిడి మానిటర్, బెట్టింగ్‌కు ఉపయోగించే అనేక గ్యాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రష్యాలో సుత్రధారులు..
ఫేక్ క్రికెట్ లీగ్కు అసలు సూత్రధారులు అశోక్ చౌదరి, మహ్మద్ ఆసిఫ్. వీరు  రష్యాలో ఉండి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. క్రికెట్ ఆడేందుకు స్థానిక యువకులకు నిర్వాహకులు షితాబ్, రిషబ్‌ డబ్బులు చెల్లించేవారు. అయితే వారి పేర్లకు బదులు రంజీ ఆటగాళ్ల పేర్లను యాప్లో అప్ లోడ్ చేసేవారు.  అశోక్ చౌదరి, ఆసిఫ్  నిర్వాహకులకు ఒక్కో మ్యాచ్ కు 40 వేల నుంచి 50 వేల వరకు చెల్లించేవారని స్థానిక ఎస్పీ దీపక్ భుకర్ తెలిపారు.  నిందితుల వాట్సాప్ కాల్స్, మేసేజ్లను వెరిఫై చేశామని..అందులో రష్యాకు చెందిన ఫోన్ నెంబర్లు, ఒక పాకిస్థాన్ ఫోన్ నెంబర్ను కనుగొన్నట్లు వెల్లడించారు. నాలుగైదు నెలల నుంచి మీరట్లో ఈ మ్యాచులు జరుగుతున్నాయన్నారు. ఫేక్ క్రికెట్ మ్యాచులు  ‘క్వార్టర్ ఫైనల్స్’కు చేరుకున్నాయని..సెమీస్ ముందు ఫేక్ క్రికెట్ లీగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు.  వాలీబాల్ మ్యాచ్‌ల వీడియోలు కూడా దొరికాయని, ఈ మ్యాచ్‌లపై నిఘా పెట్టామని ఎస్పీ భుకర్ తెలిపారు. 

ఐపీఎల్ ముగిసిన తర్వాత స్టార్ట్
ఐపీఎల్ ముగిసిన తర్వాత మూడు వారాలకు గుజరాత్లో బెట్టింగ్ సిండికేట్ మొదలైంది. నకిలీ టీ20 లీగ్ కోసం ఈ ముఠా అక్కడ మారుమూల గ్రామంలో వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని రైతులు, నిరుద్యోగ యువతకు క్రికెట్ ఆడేందుకు డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత వాటిని ఐపీఎల్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఆన్ లైన్లో ప్రసారం చేసి రష్యన్ బెట్టింగ్ రాయళ్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించేది. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా రష్యన్ కరెన్సీలో బెట్టింగ్ నిర్వహించేది. అయితే ఫేక్ క్రికెట్ లీగ్పై పోలీసులకు సమాచారం అందడంతో..ఈ ముఠా గుట్టు రట్టయింది.