ఫారిన్ వెళ్లే వారికి వీసా కోసం ఫేక్ సర్టిఫికెట్లు

ఫారిన్ వెళ్లే వారికి వీసా కోసం ఫేక్ సర్టిఫికెట్లు

ఎల్బీ నగర్, వెలుగు: విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా కోసం ఫేక్ సర్టిఫికెట్లను అందిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. చైతన్యపురిలో ముగ్గురు నిందితులను ఎస్​వోటీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బుధవారం ఎల్బీ నగర్ లోని రాచకొండ సీపీ క్యాంప్ అఫీస్ లో సీపీ మహేష్ భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన మిర్యాల ఆనంద్ కుమార్(47) వెబ్ డిజైనింగ్ నేర్చుకుని చింతలకుంట శక్తినగర్ లో ఉంటూ ఫ్లెక్స్ డిజైనర్​గా పనిచేస్తున్నాడు. మలక్ పేటకు చెందిన మల్లెపాక హేమంత్(35), మూసారాంబాగ్​కు చెందిన షేక్ షాహిన్(30) సహకారంతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మతున్నాడు. ఇందుకోసం ఓవర్సీస్ కన్సల్టెంట్ ఆఫీసును ఏర్పాటు చేసిన హేమంత్.. వీసా ఇప్పించేందుకు ఫేక్ సర్టిఫికెట్స్ కూడా విక్రయిస్తున్నారు. వీరి నుంచి ఓయూ, జేఎన్టీయూ, ఎన్జీ రంగా, ఆంధ్రా, కాకతీయ, గీతం, గుల్బర్గా, అన్నామలై వర్సిటీలు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్​ బోర్డు.. ఇలా 12 వర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ బోనఫైడ్, ఆధార్ కార్డ్స్, ఎక్స్​పీరియన్స్ సర్టిఫికెట్స్ కూడా సీజ్​ చేశారు. కేసు విచారణలో ఉందని, ముగ్గురిని అరెస్ట్​ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చట్టప్రకారం వీసా పొందాలని, ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లను నమ్మొద్దని సీపీ సూచించారు. ఫేక్ సర్టిఫికెట్స్ తో ఇతర దేశాలకు వెళ్లిన వారు ఎవరనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.