షర్మిలను జైలుకు పంపాలని పోలీసులు ప్లాన్ చేసిన్రు.. షర్మిల తరుపు లాయర్

షర్మిలను జైలుకు పంపాలని పోలీసులు ప్లాన్ చేసిన్రు.. షర్మిల తరుపు లాయర్

డ్యూటీలో ఉన్న పోలీసులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దాడి చేశారని బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై ఎఫ్​ఐఆర్​ ఫైల్​ చేశారు పోలీసులు. అయితే షర్మిలపై మోపిన కేసులు బెయిల్ వచ్చేవేనని షర్మిల తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ వరప్రసాద్ అన్నారు.  ఏప్రిల్ 24 సోమవారం రోజున బెయిల్  పిటిషన్ దాఖలు చేశామని, అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో లేకపోవటంతో మంగళవారం ఉదయం 11 గంటలకు బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతాయని తెలిపారు. 

షర్మిల ను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించారని, 41 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు ఇవ్వలేదని అన్నారు. షర్మిలను జైలుకు పంపేందుకు  పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్​ గేమ్ ప్లాన్ చేశారని, అందుకే బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ అందుబాటులో లేరని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మహిళపై పోలీసులు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని తెలిపారు.  ఏప్రిల్ 25న షర్మిలకు బెయిల్ వస్తోందని, న్యాయం జరుగుతుందని ఆయన వెల్లడించారు.  

షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్  విధించింది. అనంతరం ఆమెను పోలీసులు చంచల్ గూడ  జైలుకు తరలించారు. అయితే ఆమెను నాంపల్లి కోర్టు నుంచి   చంచల్ గూడ జైలుకు తరలిస్తున్న టైమ్ లో పోలీసుల వాహనాన్ని అడ్డుకొని  జై షర్మిల అక్క అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.  

వైఎస్ షర్మిల అరెస్ట్ కు నిరసనగా ఏప్రిల్ 25 మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు వైఎస్ఆర్టీపీ పార్టీ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించింది.  శాంతియూతంగా నిరసనలు తెలపాలని, మౌనదీక్షలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.