- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న మ్యూల్ అకౌంట్లు
- కమీషన్ల కోసం పోతే కేసుల పాలవుతున్న యువత
- బ్యాంక్అకౌంట్ వివరాలు ఎవరికీ ఇవ్వొద్దంటున్న పోలీసులు
జగిత్యాల, వెలుగు: కమీషన్లకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు ఇచ్చి కొంతమంది కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇలాంటి మ్యూల్ అకౌంట్లు కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పార్ట్‌టైమ్ జాబ్‌ల పేరిట, కమీషన్లు ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నారు. వారు చెప్పే మాటలకు ఆశపడిన యువత కటకటాలపాలవుతున్నారు. మరికొందరు బ్యాంకు అకౌంట్ ఇస్తే ఇబ్బంది ఏముంటుందని, పైగా కమీషన్లు కూడా ఇస్తున్నారని ఆశపడుతున్నారు. ఫ్రాడ్ చేసిన అసలు మోసగాళ్లు తప్పించుకుంటే, వారి ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల కారణంగా అమాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కాగా మ్యూల్ అకౌంట్లు అంటే తమ పేరిట వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేసి, అడిగిన వారికి కిరాయికి ఇవ్వడం. ఈ మ్యూల్ అకౌంట్ల వ్యవహారంలో కొందరు బ్యాంకు అధికారులు కూడా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు తాము కొట్టేసిన డబ్బును ఈ అకౌంట్లలోకి పంపి వాటి ద్వారా మళ్లించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సైబర్ నిందితులకు ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వారు సేఫ్ అవుతుండగా.. అకౌంట్ హోల్డర్ నిందితులుగా మారుతున్నారు.
రూ.138 కోట్ల సైబర్ మోసం.. 13 మంది అరెస్ట్
మార్చ్ 6న సైబర్ నేరాల్లో కీలకంగా మారిన మ్యూల్ అకౌంట్ల వ్యవహారం కరీంనగర్‌లో పెద్ద కలకలం రేపింది. బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి కోట్ల రూపాయల మోసాలకు సహకరించిన ముఠాలోని 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ సహా పలువురు ఉన్నారు. ఈ ముఠా అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపించి వారి పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి, ఆ వివరాలను విదేశీ సైబర్ నేరగాళ్లకు అందజేస్తోంది. ఒక్కో ఖాతాకు వేల రూపాయల వరకు చెల్లింపులు, అలాగే లావాదేవీలపై కమీషన్ ఇస్తూ ఈ వ్యవహారం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా సుమారు రూ.138 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఉద్యోగులు కూడా కేవైసీ నిబంధనలు ఉల్లంఘించి ఖాతాలు తెరవడంలో సహకరించినట్లు తేలింది.
జగిత్యాలలో మ్యూల్ ఖాతాల దందా
గత ఫిబ్రవరి 28న జగిత్యాలలో ఫేక్ బ్యాంక్ మ్యూల్ ఖాతాల దందా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ పోలీసులు కొద్ది రోజులుగా చేపట్టిన విచారణలో ఖాతాదారులైన 11 మందితో పాటు, వారితో ఖాతాలు తెరిపించిన సైబర్ మోసగాళ్లపై కేసులు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి, పోరండ్ల, గుట్రాజుపల్లి గ్రామాలు, జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ, రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలం పెంబట్ల తదితర ప్రాంతాలకు చెందిన కొందరిని ఇటీవల సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. మీ ఆధార్, పాన్ కార్డులతో బ్యాంక్ ఖాతా తెరిచి మాకు ఇస్తే కమీషన్ర్ ఇస్తామంటూ ఆశ చూపి ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల ఫోన్ నంబర్ల స్థానంలో తమ నంబర్లను నమోదు చేసి, ఆ ఖాతాల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు బయటపడింది. ఖాతాలు తెరిపించినందుకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల చొప్పున ఇచ్చినట్లు విచారణలో వారు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు 11 మందిని గుర్తించిన పోలీసులు, జగిత్యాల పట్టణంలోని గాయత్రి బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, కేడీసీ తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను పరిశీలించారు. ఈ ఖాతాల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు
సమాచారం.
బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు
కమీషన్లకు ఆశపడి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు, ఆధార్, పాన్ కార్డులు ఎవరికీ ఇవ్వకూడదు. గుర్తు తెలియని వ్యక్తులకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఓటీపీ వంటివి షేర్ చేయకూడదు. ఇలా చేయడం ల్ల సైబర్ నేరాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగాలు, ఆన్లైన్ జాబ్స్ పేరుతో మోసం చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- అశోక్ కుమార్, జగిత్యాల ఎస్పీ
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన అవినాశ్ అనే యువకుడు డిజిటల్ అరెస్టు మోసం కేసులో రూ.3.48 లక్షల లావాదేవీల్లో నిందితుడిగా ఇరుక్కున్నాడు. సైబరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, తన ఖాతా ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేలింది. నేరంతో సంబంధం లేకపోయినా మ్యూల్ అకౌంట్‌గా తన బ్యాంక్ ఖాతా వాడినందుకు కేసు మాత్రం అతనిపై నమోదైంది.
జిల్లాలోని ఓ నిరుద్యోగ యువకుడికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో ఆఫర్ వచ్చింది. బ్యాంక్ డీటెయిల్స్ సేకరించిన సైబర్ నేరగాళ్లు ఆ ఖాతా ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిపి మాయమయ్యారు. సైబర్ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేయగా, సదరు నిరుద్యోగ యువకుడు కేసులో నిందితుడిగా మారాడు.
