గ్రామస్తుల దాడిలో పోలీస్​ జీపు ధ్వంసం

గ్రామస్తుల దాడిలో పోలీస్​ జీపు ధ్వంసం

లింగంపేట, వెలుగు:  పోడు పట్టాల కోసం  ఫారెస్ట్​లో చెట్లు నరికిన గ్రామస్తుల దాడిలో పోలీస్​ జీపు ధ్వంసమైనట్లు కామారెడ్డి జిల్లా అడిషనల్​ ఎస్పీ నర్సంహారెడ్డి  తెలిపారు. శుక్రవారం  లింగంపేట పోలీస్​ స్టేషన్​లో ఆయన  మాట్లాడారు..  మండలంలోని  ఎక్కపల్లి గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి పోలీస్​ జీపుపై గొడ్డళ్లు, బీరు సీసాలు, రాళ్లతో దాడిచేశారన్నారు.   నాగిరెడ్డిపేట ఏఎస్ఐ ఉమేశ్, కానిస్టేబుల్​ చంద్రయ్యకు గాయాలయ్యాయని, జీపు ధ్వంసమైనట్లు  చెప్పారు.  ఫారెస్టు భూముల ఆక్రమణ కోసం  గ్రామస్తులు ఇంటికి ఒకరు చొప్పున వెళ్లి చెట్లను నరికి వేశారన్నారు.  

ఎల్లారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఎక్కపల్లి గ్రామానికి చేరుకుని చర్చలకు రావాలని పిలువగా ఎవరూ రాలేదన్నారు. దీంతో  గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగి  జీపు ధ్వంసం చేశారని చెప్పారు.  గ్రామానికి  చెందిన ల్యాగల గోపాల్​, పాపమ్మోల్ల దుర్గయ్య, ఎల్లమోల్ల శ్రీకాంత్​, ల్యాగల రాజు, బాగయ్య, శ్రీను, తొర్రి రవి, గంగమోల్ల గంగయ్య, పాపమ్మోల్ల  ఫరంధాములు, మాదాసు బాలాగౌడ్​ అనే వ్యక్తులపై  కేసులు నమోదు చేసి రిమాండ్​చేసినట్లు వెల్లడించారు.

 ప్రభుత్వ రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించిన ఎక్కపల్లి గ్రామస్తులను ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.  సమావేశంలో  ఎఫ్​డీవో గోపాల్​రావు, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు.