మీ కూతురి డెడ్ బాడీ కుళ్లిపోతుంది.. తీసుకెళ్లండి: ట్విషా శర్మ ఫ్యామిలీకి పోలీసుల లేఖ

మీ కూతురి డెడ్ బాడీ కుళ్లిపోతుంది.. తీసుకెళ్లండి: ట్విషా శర్మ ఫ్యామిలీకి పోలీసుల లేఖ

భోపాల్: మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. 2026, మే 12న భోపాల్‎లోని కటారా హిల్స్ ప్రాంతంలో అత్తవారింట్లో ట్విషా శవమై కనిపించింది. తమ కూతురిని బతికుండగానే ఉరి వేసి చంపారని ఆమె భర్త, అత్తమామలపై ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కూతురి మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోన్న ట్విషా కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. 

స్వతంత్ర వైద్య మండలి చేత రీ పోస్ట్‎మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్విషా డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో గత 8 రోజులుగా ట్విషా మృతదేహాం భోపాల్ ఎయిమ్స్‎లోనే ఉంది. ఈ క్రమంలో ట్విషా ఫ్యామిలీకి పోలీసులు ఓ లేఖ రాశారు. 

‘‘ట్విషా మృతదేహాన్ని భోపాల్ ఎయిమ్స్ మార్చురీలో మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరుస్తున్నప్పటికీ, డెడ్ బాడీ కుళ్ళిపోకుండా నిరోధించడానికి మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఈ సౌకర్యం ఎయిమ్స్ భోపాల్‌లో అందుబాటులో లేదు. రీ పోస్ట్‌మార్టం నిర్వహించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ట్విషా డెడ్ బాడీ చాలా రోజులుగా మార్చురీలో ఉండటంతో అది కుళ్లిపోయే అవకాశం ఉంది. దయచేసి ట్విషా మృతదేహాన్ని తీసుకెళ్లండి’’ అని పోలీసులు ట్విషా ఫ్యామిలీకి సూచించారు. 

►ALSO READ | బొద్దింక జనతా పార్టీ వెనకున్న ఈ అభిజీత్ దీప్కే ఎవరు..? టార్గెట్ ఏంటి..?

ట్విషా శర్మ తండ్రి నవనిధి శర్మ బుధవారం (మే 20) మీడియాతో మాట్లాడుతూ.. ట్విషా పోస్ట్‌మార్టం రిపోర్ట్‎లో చాలా లోపాలు ఉన్నాయని.. కనీసం లిగేచర్‌ కూడా సమర్పించకుండానే పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ట్విషా అత్త ముందస్తు బెయిల్ పొందేందుకు వీలుగా లిగేచర్ సమర్పణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని అన్నారు. 

పోస్ట్ మార్టం రిపోర్టులో ఎన్నో తప్పులు బయటపడ్డాయి.. సాక్ష్యాలను తారుమారు చేశారనేది స్పష్టంగా అర్థం అవుతుందని.. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యవస్థలో మధ్యతరగతి వ్యక్తి న్యాయం ఎలా ఆశించగలడని ప్రశ్నించారు. ట్విషా డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని.. అప్పటి వరకు మృతదేహాన్ని తీసుకోమని తేల్చిచెప్పారు. ట్విషా మృతదేహాన్ని జాగ్రత్తగా భద్రపరచమని ఆసుపత్రిని కోరామని తెలిపారు.