- చైర్మన్ ఎన్నికపై ముసురుతున్న న్యాయపరమైన చిక్కులు
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చుట్టూ రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో చెలరేగిన విభేదాలు చివరకు పోలీసు నోటీసులు, కోర్టు కేసుల వరకు వెళ్లాయి. కౌన్సిలర్ ఆకుల యాదగిరిని నిర్బంధించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకుకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
మున్సిపాలిటీలోని 24 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో మెజారిటీ సాధించినప్పటికీ, చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. చైర్మన్ రేసులో ఉన్న ఆకుల యాదగిరిని, ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళీకృష్ణను బీఆర్ఎస్ నేతలే కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదులతో ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.
కాగా, ఇటీవల కోర్టు ముందు హాజరైన ఆకుల యాదగిరి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి తనను చీరాలలో బౌన్సర్ల మధ్య నిర్బంధించి ఒత్తిడి తెచ్చారని వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో, బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఆయన కొడుకుకు నోటీసులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని వారి నివాసంలో ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి, మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
సందిగ్ధంలో చైర్మన్ ఎన్నిక!
మరోవైపు, చైర్మన్ ఎన్నికపై న్యాయపరమైన చిక్కులు ముసురుతున్నాయి. ఒకవైపు కిడ్నాప్ డ్రామాలు నడుస్తుండగానే, మరోవైపు పలువురు కౌన్సిలర్ల గెలుపుపై ఫిర్యాదులు వెల్లువెత్తడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. 23వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నీలం శ్వేత తప్పుడు పత్రాలతో గెలిచారని, అలాగే 24వ వార్డులో గెలిచిన చిలుకల బుగ్గరాములుకు మూడు చోట్ల ఓటు హక్కు ఉందంటూ కాంగ్రెస్, జనసేన అభ్యర్థులు ఆధారాలతో సహా కోర్టులు, ఎన్నికల అధికారులు, కలెక్టర్, బీసీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
వీరి అభ్యర్థిత్వాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు, ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తనను చైర్మన్గా ప్రకటించాలని 7వ వార్డు కౌన్సిలర్ కూడా కోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం చిక్కుముడిగా మారింది. ఈ న్యాయపరమైన పోరాటాల మధ్య అసలు చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అన్న డైలామాలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు ఉండిపోయారు.
