తాతా మధు, నవీన్రెడ్డి బెయిల్ రద్దు చేయండి..నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్

తాతా మధు, నవీన్రెడ్డి బెయిల్ రద్దు చేయండి..నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్

హైదరాబాద్,వెలుగు: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు మంజూరు చేసిన బెయిల్‌‌ను రద్దు చేయాలని కోరుతూ సైఫాబాద్ పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విధించిన షరతులను నిందితులు ఉల్లంఘించారనే ప్రధాన ఆరోపణతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్‌‌పై అనుచిత వ్యాఖ్యల ఘటనకు సంబంధించి నమోదైన ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీలకు మంగళవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని కోర్టు స్పష్టమైన షరతులు విధించినప్పటికీ, బెయిల్‌‌పై బయటకు రాగానే నిందితులు వాటిని ఉల్లంఘించారని పోలీసులు తమ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివిధ చానెళ్ల వీడియోలు, సోషల్ మీడియా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టు నిబంధనలను బేఖాతరు చేసినందున నిందితుల బెయిల్‌‌ను రద్దు చేయాలని కోరారు. అలాగే, ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నందున, తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని కూడా పోలీసులు తమ పిటిషన్‌‌లో అభ్యర్థించారు.