ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ఉద్రిక్తత..భారీగా ట్రాఫిక్ జామ్

ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ఉద్రిక్తత..భారీగా ట్రాఫిక్ జామ్

ట్యాంక్ బండ్లో  పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్లో  నిమజ్జనం చేయొద్దంటూ పీవోపీ గణేష్ విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గణేష్ విగ్రహ మండపాల నిర్వాహకులు అందోళన నిర్వహించారు. ట్యాంక్ బండ్ రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

ట్యాంక్ బండ్ లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా గణేష్ మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. హిందూ పండుగలపై ప్రభుత్వ ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. గత సంవత్సరం నుండి ప్రభుత్వం పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లోనే పీవోపీ విగ్రహాలను ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని తేల్చిచెప్పారు. 

 

హైదరాబాద్‌లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్ బండ్ లో  పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూడాలని, పీవోపీ విగ్రహాల నిమజ్జనం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి, అమలు చేసిన విధానానికి సంబంధించి కోర్టుకు నివేదిక సమర్పించాలని పేర్కొంది.