డ్రగ్స్ పార్టీ: నా కొడుకు విలువలు కలిగిన వ్యక్తి

డ్రగ్స్ పార్టీ: నా కొడుకు విలువలు కలిగిన వ్యక్తి
  • బట్టబయలు చేసిన టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు
  • బంజారాహిల్స్‌‌ రాడిసన్ బ్లూ హోటల్‌‌లోని పబ్‌‌పై రెయిడ్స్‌‌
  • 148 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వీరిలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్, గల్లా సిద్ధార్థ తదితరులు
  • బంజారాహిల్స్‌‌ పోలీస్ స్టేషన్‌‌లో విచారణ తర్వాత ఇండ్లకు
  • దాడుల్లో 11 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురిపై కేసులు
  • ఇద్దరి అరెస్టు.. పరారీలో మరొకరు
  • ఇన్‌‌స్పెక్టర్‌‌ శివచంద్ర సస్పెన్షన్, ఏసీపీ సుదర్శన్‌‌కి చార్జ్‌‌ మెమో


హైదరాబాద్‌‌, వెలుగు: ఎక్కడో హైదరాబాద్​ శివార్లలో ఉన్న రిస్టార్టు​ల్లోనో, ఫామ్​హౌస్​ల్లోనో కాదు.. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్​లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీ బట్టబయలైంది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌‌లోని పబ్‌‌లో కస్టమర్లు ఆదివారం తెల్లవారుజాము దాకా సెలబ్రేషన్లు చేసుకుంటూ పోలీసులకు చిక్కారు. వారిలో కొందరు డ్రగ్స్‌‌ తీసుకుంటూ పట్టుబడ్డారు. పబ్‌‌లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉండడం సంచలనంగా మారింది. దాదాపు 148 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అందరినీ విచారించి ఇండ్లకు పంపేశారు. అవసరమైన వారికి తర్వాత నోటీసులు పంపి, విచారణ జరుపుతామని తెలిపారు. పబ్‌‌లో కొకైన్ వాడుతున్నట్లుగా గుర్తించామని, ముగ్గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ పి.శివచంద్ర సస్పెన్షన్‌‌కు గురయ్యారు. ఆపరేషన్‌‌లో పాల్గొన్న టాస్క్‌‌ఫోర్స్ ఇన్‌‌స్పెక్టర్ కె.నాగేశ్వర్​రావుకు.. శివచంద్ర స్థానంలో చార్జ్ ఇచ్చారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంలో నార్కోటిక్స్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ వింగ్ దర్యాప్తు చేపట్టింది.

డ్రగ్స్ తీసుకున్నదెవరు?

పబ్‌‌లో 11 గ్రాముల డ్రగ్స్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కొకైన్, ఎండీఎమ్‌‌ఏ, చరస్‌‌ లాంటి  డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మేనేజర్ అనిల్‌‌కుమార్‌‌‌‌ కంటైనర్ ట్రేలో 5 గ్రాముల కొకైన్‌‌ స్వాధీనం చేసుకున్నారు. పబ్‌‌కి వచ్చిన వారి వివరాలతో ఉన్న రికార్డ్‌‌ 
సీజ్‌‌ చేశారు. మేనేజర్​ను, స్టాఫ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. రూల్స్‌‌కు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల దాకా పబ్‌‌ నిర్వహించడంపై కేసు రిజిస్టర్ చేశారు. డ్రగ్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ)కు పంపించారు. తర్వాత 20 మంది పబ్‌‌ స్టాఫ్‌‌, పార్టీల్లో పాల్గొన్న కస్టమర్లు సహా 148 మందిని బంజారాహిల్స్ పీఎస్‌‌కి తరలించారు. 90 మంది అబ్బాయిలు, 38 మంది అమ్మాయిలను విచారించారు. ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో విచారణ  జరిపారు. వాళ్లు తాగిన లిక్కర్‌‌‌‌ వివరాలు రికార్డ్‌‌ చేశారు. 

అనుమానితుల ఫోన్ నంబర్స్ సేకరించారు. వాట్సాప్ చాట్స్‌‌‌‌ పరిశీలించారు. ఉదయం 10 గంటల కల్లా మొత్తం స్టేట్‌‌‌‌మెంట్స్ రికార్డ్‌‌‌‌ చేశారు. విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని సూచించారు. పబ్‌‌‌‌ జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ అనీల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఫోన్ సీజ్ చేశారు. మరో మేనేజర్ కునాల్‌‌‌‌ చాటింగ్‌‌‌‌ డేటా ఆధారంగా డ్రగ్స్ పెల్డర్స్‌‌‌‌, కస్టమర్ల లిస్ట్‌‌‌‌ తయారు చేస్తున్నారు.‌‌‌‌

4 గంటలపాటు స్టేషన్‌‌‌‌లో నిహారిక

పబ్‌‌‌‌ పార్టీల్లో పాల్లొన్న వారిలో సింగర్ రాహుల్‌‌‌‌ సిప్లిగంజ్, సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక, గల్లా జయదేవ్‌‌‌‌ కుమారుడు సిద్ధార్థ్‌‌‌‌ సహా పలువురు రాజకీయ నేతల పిల్లలను పోలీసులు విచారించారు. నిహారికను 4 గంటల పాటు స్టేషన్‌‌‌‌లోనే ఉంచారు. మీడియా కంట పడకుండా పంపేంచేందుకు యత్నించారు. ముందుగా 142 మందితో పోలీసులు లిస్ట్‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ చేశారు. స్టేషన్ నుంచి నిహారిక వెళ్తున్న విజువల్స్‌‌‌‌ బయటపడడంతో ఆమె పేరు కూడా లిస్ట్‌‌‌‌లో చేర్చారు. తర్వాత ఐదుగురి పేర్లు చేర్చి.. మొత్తం 148 పేర్లతో జాబితా తయారు చేశారు. ఇందులో సుమారు 100 మంది వరకు మందు తాగినట్లు గుర్తించారు. వీరిలో రెగ్యులర్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అందర్నీ వదిలిపెట్టామని, అవసరాన్ని బట్టి పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు.

ప్రముఖుల ఆందోళన

పోలీస్ రెయిడ్స్‌‌‌‌లో ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు ఉన్నారని సమాచారం బయటికి రావడంతో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. పోలీస్ స్టేషన్‌‌‌‌కు మీడియా చేరుకున్న తర్వాత పోలీసుల ద్వారా కొన్ని పేర్లు వెల్లడయ్యాయి. ఇవి టీవీల్లో ప్రసారం కావడంతో ఎక్కడివారు అక్కడ అలర్ట్ అయ్యారు. నిహారిక పోలీసుల అదుపులో ఉందని తెలుసుకున్న నాగబాబు.. ఇందులో తన కూతురు ప్రమేయమేమీ లేదని వీడియో విడుదల చేశారు. తాను ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్‌‌‌‌ కోసం వెళ్లానని, డ్రగ్స్‌‌‌‌తో తనకు సంబంధం లేదని రాహుల్ సిప్లిగంజ్ చెప్పారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు పేరు బయటకు రావడంతో.. ఆయన గాంధీభవన్‌‌‌‌లో వివరణ ఇచ్చుకున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన తన కొడుకుని బద్నాం చేస్తున్నారని అన్నారు. పబ్‌‌‌‌కు మాజీ మంత్రి రేణుకా చౌదరి కూతురు తేజస్విని ఓనర్ అని ప్రచారం జరిగింది. దీంతో తన కూతురుకు ఏం సంబంధం లేదని రేణుకా చౌదరి ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు.

అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌‌

బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్‌‌‌‌ 6 లో రాడిసన్ బ్లూ హోటల్‌‌ ఉంది. అందులో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌‌ నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయం దాటి పబ్ నడుపుతున్నారని, అందులో రేవ్‌‌ పార్టీ జరుగుతున్నదని, వందల మంది డ్రగ్స్ తీసుకుంటున్నరని టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులకు శనివారం అర్ధరాత్రి దాటాక 1.40కి సమాచారం అందింది. దాంతో వాళ్లు స్థానిక పోలీసుల సహకారంతో 2 గంటల సమయంలో మఫ్టీలో పబ్‌‌కి వెళ్లారు. అప్పటికే పబ్‌‌లో ఏడుకు పైగా బర్త్‌‌డే పార్టీలు జరుగుతున్నాయి. లిక్కర్‌‌‌‌, అనుమానాస్పద పౌడర్‌‌ (కొకైన్​)‌‌ను పోలీసులు గుర్తించారు. టేబుల్‌‌పై డ్రగ్స్ తీసుకునే స్ట్రాలు కనిపించాయి. దాంతో ఎంట్రీ, ఎగ్జిట్‌‌ గేట్స్‌‌ మూసి తనిఖీలు చేశారు. డెకాయ్‌‌ ఆపరేషన్‌‌తో అంతకుముందే కొందరు పోలీసులు పబ్‌‌లో రెక్కీ నిర్వహించి ఉండడంతో ఆపరేషన్ పకడ్బందీగా చేపట్టారు. పోలీసుల రాకను పసిగట్టిన కొందరు తమ వద్ద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను బయటకు విసిరేశారు. మరికొంత మంది బాత్‌‌రూమ్‌‌లోకి వెళ్లి డ్రగ్స్ ప్యాకెట్లు దాచిపెట్టారు.

బర్త్‌‌‌‌డే పార్టీకి పోయిన

“మా ఫ్రెండ్‌‌‌‌ పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో కలిసి పబ్‌‌‌‌కి వెళ్లాను. అప్పుడు 150 నుంచి 200 మంది వరకు పబ్‌‌‌‌లో ఉన్నారు. చాలా మంది బర్త్‌‌‌‌డే పార్టీలు చేసుకున్నారు. నాకు డ్రగ్స్‌‌‌‌ అలవాటు లేదు. ఏదో వీకెండ్స్‌‌‌‌లో చిల్‌‌‌‌ కోసం పబ్స్‌‌‌‌కి వెళ్తుంటా. అక్కడ ఎవరు డ్రగ్స్‌‌‌‌ తీసుకున్నారో నాకు తెలియదు. పోలీసులు నన్ను కూడా విచారించారు. ఎవరో తీసుకున్నా రని.. పార్టీకి వెళ్లిన అందరినీ బ్లేమ్‌‌‌‌ చేయడం ఎందుకు? ఎలాంటి పరీక్షలకైనా రెడీ’’
- రాహుల్‌‌‌‌ సిప్లిగంజ్‌‌‌‌

యాప్‌‌‌‌ ద్వారా పబ్‌‌‌‌లోకి యాక్సెస్

‘‘పబ్ నిర్వాహకులు అర్జున్‌‌‌‌ వీరమాచినేని, అభిషేక్‌‌‌‌ ఉప్పాల, జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేశాం. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ శివచంద్రను సస్పెండ్‌‌‌‌ చేశాం. ఏసీపీ సుదర్శన్‌‌‌‌కి చార్జ్‌‌‌‌మెమో ఇచ్చాం. 20 మంది పబ్ స్టాఫ్‌‌‌‌ సహా148 మంది వివరాలు తీసుకున్నాం. అవసరమైతే వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తాం. పబ్ నిర్వాహకులు ఒక యాప్ నడుపుతున్నారు. పర్మినెంట్ కస్టమర్లకు ఇందులో యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ అయిన కస్టమర్లకు ఒక ఓటీపీ ఇస్తారు. దాని ద్వారా పబ్‌‌‌‌ లోపలికి ఎంటర్ అవుతారని గుర్తించాం. పకడ్బందీగా జరుగుతున్న వ్యవహారంలో ఈ రోజు మేనేజర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వద్ద 5 గ్రాముల కొకైన్ సీజ్ చేశాం. డ్రగ్స్‌‌‌‌ ఎక్కడి నుంచి ఎలా వస్తున్నదో విచారిస్తున్నాం. గోవా లింక్స్‌‌‌‌పైనా ఆరా తీస్తున్నాం’’
- జోయల్ డేవిస్‌‌‌‌, డీసీపీ, వెస్ట్‌‌‌‌జోన్‌‌‌‌

అవాస్తవాలు ప్రచారం చేయొద్దు

“పార్టీకి నా కూతురు నిహారిక వెళ్లింది వాస్తవమే. పబ్‌‌‌‌ను టైమింగ్స్‌‌‌‌కు మించి నడపడం వల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అంతేతప్ప నా కూతురు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదు. పోలీసులు కూడా నిర్ధారించారు. దయచేసి ఎలాంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు’’
- నాగబాబు, సినీ నటుడు

నా కొడుక్కి సంబంధం లేదు

‘‘నా కొడుకు బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి వెళ్తే అభాండాలు వేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న మా కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు మా కుటుంబం దూరంగా ఉంటుంది. కావాలంటే నిజానిజాలు తేల్చండి. అసలు సిటీలో ఉన్న అన్ని పబ్‌‌‌‌లను క్లోజ్​ చేయాలి. లిక్కర్ బ్యాన్ చేయాలి. సిటీకి డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయో విచారణ చేపట్టాలి’’
- అంజన్ కుమార్ యాదవ్,  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఆరోపణలన్నీ అబద్ధాలే

‘‘రాడిసన్ బ్లూ హోటల్‌‌‌‌లో ఉన్న పబ్‌‌‌‌తో నా కూతురు తేజస్వినీ చౌదరికి ఎలాంటి సంబంధం లేదు. ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. నా కుమార్తె పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ యజమాని కాదు. ఇందులో తేజస్వినికి ఎలాంటి సంబంధం లేదు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోలేదు. ప్రశ్నించలేదు. నా కుమార్తెపై వచ్చిన వార్తలన్నీ ఖండిస్తున్నా’’
- మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి

నా కొడుకు.. విలువలు కలిగిన వ్యక్తి

“నా కొడుకు నిరపరాధి. 148 మందిలో డ్రగ్స్ ఎవరు తెచ్చారో కనిపెట్టకుండా నా కొడుకు అభిషేక్‌‌‌‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. అభిషేక్ విలువలున్న వ్యక్తి. డ్రగ్స్ సరఫరా చేసేంత మూర్ఖుడు కాదు. నా కొడుకుపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నరు’’
- శారద, పబ్ యజమాని అభిషేక్ తల్లి