కల్లు దుకాణాలపై పోలీసుల దాడులు ఆపాలి : పల్లె లక్ష్మణ్​రావుగౌడ్

కల్లు దుకాణాలపై పోలీసుల దాడులు ఆపాలి :  పల్లె లక్ష్మణ్​రావుగౌడ్

పంజాగుట్ట, వెలుగు: అకారణంగా కల్లు సొసైటీ దుకాణాలపై పోలీసులు చేస్తున్న దాడులను అరికట్టాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్​రావుగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసుల దాడులతో కల్లు సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బేగంటపేటలోని హోటల్​హరిత ప్లాజాలో శనివారం సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్​రావు గౌడ్ మాట్లాడుతూ.. లిక్కర్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కై బైండవర్​పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా103 సొసైటీల్లో మొత్తం 61 వేల మంది సభ్యులున్నారని చెప్పారు. గత ప్రభుత్వం సంఘ భవనం కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల్లో, భవనం నిర్మించి నిధులు విడుదల చేయాలన్నారు. కల్లు గీసే టైంలో గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్​చేశారు. 

ప్రతి జిల్లాలో తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని, పనిముట్లు అందజేయాలని కోరారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్​గౌడ్, ఉపాధ్యక్షుడు సంతోశ్​గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్, సిటీ అధ్యక్షుడు దేవేందర్​గౌడ్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ముఖేష్​గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రతాప్​లింగం గౌడ్, లక్ష్మీపతి, జిల్లాలు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.