పోలీసులు, ఇన్ఫోసిస్​కు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్?

పోలీసులు, ఇన్ఫోసిస్​కు రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్?
  • పబ్లిక్ ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం కొత్త ప్లాన్
  •     ఇప్పటికే పోలీసులకు హెచ్ఎండీఏ, హౌసింగ్ అధికారుల లేఖ
  •     త్వరలో ఇన్ఫోసిస్ అధికారులతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు : రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లను కొనేందుకు పబ్లిక్ ముందుకు రావడం లేదు. ధరలు తక్కువ ఉన్నా.. 10 ఏండ్ల కింద నిర్మించినవి ఇప్పటికీ స్టాండర్డ్​గా ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. వెనుకడుగు వేస్తున్నారు. బండ్లగూడ, పోచారంలో ఉన్న మొత్తం ఫ్లాట్స్ ను వేలానికి ఉంచినా అమ్ముడుపోలేదు. దీంతో 5వ సారి వేలానికి హెచ్ఎండీఏ, హౌసింగ్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక గాజుల రామారం, పోచారంలో విడిగా కాకుండా టవర్లను గంపగుత్తగా అమ్మేందుకు ప్రభుత్వం కొత్త ప్లాన్​ వేసింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్​ చేసింది. 

పోలీసులకు జవహర్ నగర్ ఫ్లాట్స్

జవహర్ నగర్​లో ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కింద 17 టవర్లను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. వీటిలో మొత్తం 2,800 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిని పబ్లిక్ కోసం కాకుండా గంపగుత్తగా టవర్ల వారీగా అమ్మకానికి ప్రభుత్వం ఉంచింది. వీటికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.  అయితే, ఇక్కడి టవర్ల విక్రయానికి డంపింగ్ యార్డ్ అడ్డంకిగా మారింది. గ్రేటర్​లోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండడంతో దుర్వాసన, పొగ, పొల్యూషన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని బిల్డర్లు వెనుకడుగు వేస్తున్నారు.

దీంతో జవహర్ నగర్ రాజీవ్ స్వగృహ టవర్లను పోలీసులకు నామమాత్రపు ధరకు గంపగుత్తగా ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై డీజీపీ, సీపీలకు హౌసింగ్ అధికారులు లేఖ రాయగా.. ఏసీపీ స్థాయి అధికారులు పరిశీలించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్​కు పోచారం ఫ్లాట్స్​

ఇన్ఫోసిస్ కంపెనీకి దగ్గర్లోని పోచారంలో రాజీవ్ స్వగృహకు 4 టవర్లు ఉండగా, ఒక్కో టవర్ లో 9 ఫ్లోర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క టవర్ లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్​లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఒక్కో ఎస్ఎఫ్​టీ రూ.1,650 గా ఖరారు చేశారు. రూల్స్ మారిస్తే కొనలేమని బిల్డర్లు, పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు చెప్పడంతో వీటిని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఆ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించనున్నారు. కొత్తగా జాబ్ లో చేరిన వాళ్లు, రూ.50వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులు కొనేందుకు ముందుకు వస్తారని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఓపెన్ ఫర్ సేల్ 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో అన్ ఫర్నీష్డ్  రాజీవ్ స్వగృహ టవర్లు ఎలా ఉన్నవి అలా అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. పోచారంలో 9 అంతస్తుల నాలుగు టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్​లో కనీసం 72 నుంచి 198 ఫ్లాట్​లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఒక్కో ఎస్ఎఫ్​టీ రూ.1,650 గా ఖరారు చేశారు.  అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తుల ఐదు టవర్లు ఉండగా  వాటిల్లో ఒక్కొక్క టవర్​లో 112 ఫ్లాట్ లను నిర్మించుకునే సదుపాయం ఉంది. ఇందులో సెమి ఫర్నీష్డ్ వి రూ.1,350 , ఫర్నీష్డ్ వి రూ.1,650గా అధికారులు ఖరారు చేశారు.

రూల్స్ మారిస్తే కొంటం 

ఫ్లాట్ల వేలంపై ఈ ఏడాది జనవరిలో  రియల్​ ఎస్టేట్​ కంపెనీలు, బిల్డర్లతో ప్రభుత్వం ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్లు, హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు, సుమారు 30 మంది రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులు, బిల్డర్లు హాజరయ్యారు. వీటిని తీసుకునేందుకు తమకు ఇంట్రస్ట్ ఉందని, అయితే ప్రభుత్వం ఖరారు చేసిన గైడ్ లైన్స్ సరిగా లేవని, సవరించాలని అధికారులను కోరారు.

ఈఎండీ డిపాజిట్ ను 15 రోజుల నుంచి  నెలకు పెంచాలని,  ఫైనల్ పేమెంట్స్ గడువు 6 నెలలకు  పెంచాలని, సింగిల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించాలని, జీఎస్టీ భారం లేకుండా చూడాలని కోరారు.  అయితే, వారి సలహాలు, సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని అధికారులు బిల్డర్లకు సూచించారు. కానీ, ప్రభుత్వం ఇంత వరకు రూల్స్ సవరించకపోవడంతో అధికారులు మల్ల గుల్లాలు పడుతున్నారు.