
- నిమిషాల్లోనే రికవరీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
బషీర్ బాగ్, వెలుగు : సైబర్ నేరగాళ్లను నమ్మి 18 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి డబ్బులను నిమిషాల్లోనే సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపిన ప్రకారం.. అంబర్ పేటలో ఉండే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కి గురువారం ఫెడెక్స్ కంపెనీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆధార్ కార్డ్ ద్వారా ముంబై నుంచి ఇరాన్ కు డ్రగ్స్ కొరియర్ అయినట్టు.. సైబర్ క్రైమ్ అధికారిని అంటూ స్కైప్ వీడియో కాల్ చేశారు. కేసు నమోదైందని ఫేక్ ఎఫ్ఐఆర్ పంపించారు.
అకౌంట్ లోని డబ్బులను పంపిస్తే , ఆర్బీఐ రూల్స్ మేరకు వెరిఫై చేసి, తిరిగి ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. నమ్మిన బాధితుడు డబ్బులు లేవని చెప్పగా.. పర్సనల్ లోన్ తీసుకొని డబ్బులు పంపాలని ఒత్తిడి చేశారు. దీంతో అతడు రూ.18 లక్షలు లోన్ తీసుకొని సైబర్ చీటర్స్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. వారికి కాల్ చేస్తే రిప్లై లేదు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
గురువారం సాయంత్రం 6.58 గంటలకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి బాధితుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ అయిన రూ. 18 లక్షలను రాత్రి 07.09 గంటలకు బ్లాక్ చేయించారు. 11 నిమిషాల వ్యవధిలోనే ఆపరేషన్ సక్సెస్ కావడంతో కానిస్టేబుల్ ను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అభినందించారు.