వారాసి గూడ చికెన్ షాప్ లో 610 కిలోల కుళ్లిన చికెన్ సీజ్

వారాసి గూడ చికెన్ షాప్ లో 610 కిలోల కుళ్లిన చికెన్ సీజ్
  •     వారాసిగూడ చికెన్​ షాప్​ లో పట్టుకున్న పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ పరిధిలో ఫ్రెష్​ చికెన్ పేరుతో.. కుళ్లిపోయిన చికెన్​ను అమ్ముతున్న ఓ హోటల్​పై పోలీసులు దాడి చేసి 610 కిలోల కుళ్లిన మాంసాన్ని సీజ్​చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లోని వారాసిగూడ పీఎస్​ పరిధిలో షేక్ షకీల్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఏ1 ఫ్రెష్ చికెన్​పేరుతో మార్ట్​ నిర్వహిస్తున్నాడు. 

ఇక్కడి నుంచి రోజూ వందల సంఖ్యలో కస్టమర్లు చికెన్​ కొంటారు. దీంతోపాటు జోన్​ పరిధిలోని వివిధ హోటళ్లకు, రెస్టారెంట్లకు షకీల్​ భారీగా చికెన్​ ను సప్లయ్​ చేస్తాడు. ఈషాప్​లో పాడైపోయిన చికెన్‌‌‌‌ను అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారాసిగూడ సీఐ, ఎస్ఐ మంగళవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు చికెన్​ మార్ట్​లో తనిఖీలు నిర్వహించారు. 

అపరిశుభ్రమైన ఫ్రీజర్లలో, బొద్దింకలు, ఎలుకలు తిరిగే ప్రాంతంలో చికెన్​ నిల్వ ఉన్నట్టు గుర్తించారు. ఆ చికెన్​పూర్తిగా కుళ్లిపోయి, బూజుపట్టి, కంపు కొడుతుండగా.. పోలీసులు వెంటనే దాన్ని సీజ్​ చేశారు. సదరు దుకాణానికి ట్రేడ్​ లైసెన్స్​ కూడా కిందటి ఏడాది గడువు ముగిసింది. అయినా రిన్యూవల్​ చేయకుండానే కొనసాగిస్తున్నట్టు బయటపడింది. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారాసిగూడ ఇన్‌‌‌‌స్పెక్టర్ జి. రాజేందర్ గౌడ్, ఎస్ఐ కె. రామచంద్ర రెడ్డి సిబ్బంది పాల్గొనగా.. డీసీపీ కె. రక్షిత కృష్ణ మూర్తి, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షించారు.