బీఆర్ఎస్​ వైఫల్యాల కార్లు సీజ్

బీఆర్ఎస్​ వైఫల్యాల కార్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతి, వైఫల్యాలపై కాంగ్రెస్​ పార్టీ స్టార్ట్​చేసిన వినూత్న ప్రచార రథాలు ‘బీఆర్ఎస్​ వైఫల్యాల కార్ల’ను పోలీసులు సీజ్​చేశారు. శనివారం రాత్రి పార్టీ నేతలు, సిబ్బంది అంతా వెళ్లిపోయాక ఎవరూ లేని సమయంలో పోలీసులొచ్చి వాటిని సీజ్​చేశారు. అనంతరం వాటిని స్టేషన్​కు తీసుకెళ్లారు. అయితే, దీనిపై కాంగ్రెస్​ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 

పోలీసులు దౌర్జన్యంగా వాహనాలను తీసుకెళ్లారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ ​కుమార్​రెడ్డి ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్​కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వెంటనే వాహనాలను తిరిగి గాంధీభవన్​లో అప్పగించాలని డిమాండ్​చేశారు. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 

బీఆర్ఎస్​  వైఫల్యాలను ఎండగట్టేలా ఆ పార్టీ గుర్తు అయిన కారుపైనే వాటిని రాసి ప్రజలకు తెలియజెప్పాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. అందులో భాగంగా గులాబీ రంగు కార్లను తయారు చేయించి, వాటిని శుక్రవారం ప్రారంభించింది. వాటిపై కేసీఆర్​ వైఫల్యాలను వివరించింది. పోలీసులు తాజాగా వాటిని సీజ్​ చేశారు.