లాక్‌డౌన్‌‌లో పోలీసుల సేవలు మర్చిపోలేనివి

లాక్‌డౌన్‌‌లో పోలీసుల సేవలు మర్చిపోలేనివి

జహీరా నగర్: ఓల్డ్ సిటీ జహీరా నగర్‌‌‌లో భరోసా సెంటర్ నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్, పోలీస్ హోసింగ్ సొసైటీ అధ్యక్షులు కోలేటి దామోదర్, స్వాతి లక్రా, షికా గోయల్‌‌తోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షికా గోయల్ మాట్లాడుతూ.. భరోసా సెంటర్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇది నగరంలో రెండోదని, సేఫ్ సిటీలో భాగంగా ఈ సెంటర్‌‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్, రేప్ బాధితులకు, గృహహింస మహిళలకు, పిల్లల సంరక్షణ కోసమే భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భద్రత కోసం 3 వేల సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 

లాక్‌డౌన్ సమయంలో పోలీసులు అందించిన సేవలు మర్చిపోనివని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘మహిళలతో గౌరవంగా  ఉండాలని ఖురాన్ బోధిస్తుంది. స్త్రీలపై దాడులు చేయడం సరికాదు. భరోసా సెంటర్ పాత బస్తీలో అవసరం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ అవసరం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఇలాంటి భరోసా సెంటర్ అవసరం లేని పరిస్థితులు రావాలి. కరోనా మరోసారి విజృంభిస్తోంది. ప్రజలు జాగ్రత్త ఉండాలె. శుభకార్యాల్లో జాగ్రత్తలు వహించాలి’ అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.