- పోలీసు స్టేషన్‌కు పలువురి తరలింపు
- రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు నిర్బంధకాండ
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు ఫైర్
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: కిషన్‌రెడ్డి
- ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటీ?: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ.. ఆయనను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రాంచందర్ రావు బయటకు వస్తుండగా పోలీసులు ఆయనను బలవంతంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకు రాంచందర్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వాహనాలను కార్యకర్తలు
అడ్డుకోవడంతో అక్కడ కాసేపు టెన్షన్ నెలకొంది.
మరోపక్క బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయటకు రాకుండా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు దిగ్బంధించారు. వరుసగా రెండోరోజూ ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లేందుకు ఏలేటి ప్రయత్నించగా.. పోలీసులు గేట్లు మూసి అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ ను సైతం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఎమ్మెల్సీలకు అడ్డంకులు..
మహేంద్ర హిల్స్ లో టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. ఆయన కామారెడ్డికి బయల్దేరుతుండగా తుకారాం గేట్ పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని హౌస్ అరెస్ట్ చేశారు. అటు ఆర్ సీ పురంలో మరో ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ నేతల దాడులను అరికట్టాల్సింది పోయి.. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం ఏంటని బీజేపీ నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తే దాడులా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, నిరూపించమంటే అక్రమ అరెస్టులకు పాల్పడడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి, బాన్సువాడ పర్యటనకు వెళ్లకుండా తనను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై, పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను నిరూపించాలని అడిగితే ఎమ్మెల్యే ఆఫీసుపై దాడులు చేయడం ఏందని ప్రశ్నించారు. ఇది చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యఅని విమర్శించారు. దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లయితే.. పోలీసులు మాత్రం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్ చేశారని వాపోయారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఖూనీ చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి వెళ్లేందుకు రెడీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావును అరెస్టు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నదని, పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలని సవాల్ చేస్తే.. కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు గేటును కారుతో గుద్ది ధ్వంసం చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బాధితుడైన ఎమ్మెల్యేకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడి అని పేర్కొన్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు, అరెస్టులకు, బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాజకీయ అరెస్టులు ఆపాలని, లేదంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రజలే ముందుకు వస్తారని అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన: మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రాక్షస పాలన సాగిస్తోందని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను పోలీసులతో నిర్బంధిస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పాలన చేతగాకనే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రెండు రోజుల పాటు తనతో పాటు బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రేవంత్.. కేసీఆర్ కంటే డేంజర్: అర్వింద్
రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కంటే ప్రమాదకరంగా మారారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేవలం 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు సపోర్టు చేస్తున్నారని, వారికి అమ్ముడుపోయారని ఆరోపించారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది: బండి సంజయ్
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని, ఈ అరాచకాలను అడ్డుకోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అరెస్టును, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి ఘటనలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే అని సంజయ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు.
